చిట్ ఫండ్ మోసం కేసులో ఇద్దరు తెలుగుదేశంపార్టీ నేతలను సీఐడీ అరెస్టుచేసింది. అరెస్టయిన ఇద్దరు తండ్రి, కొడుకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసరావు. ఇందులో విశేషం ఏముందంటారా వీళ్ళిద్దరిలో శ్రీనివాసరావు ఏమో రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవానీకి భర్త కాగా అప్పారావేమో భవానీకి మామగారు. ఇంతకీ భవానీ ఎవరంటే శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చెల్లెలు. రామ్మోహన్, భవానీ ఇద్దరు కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రనాయుడు వారసులు.





ఇంతపెద్ద చరిత్రుంది కాబట్టే తండ్రి, కొడుకుల అరెస్టు టీడీపీలో సంచలనమైంది. రాజమండ్రిలో చాలాకాలంగా జగజ్జనని పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్నారట. నిర్దిష్టంగా కంపెనీలో జరిగిన మోసం ఇది అని బయటకు రాలేదు. అయితే నిధుల అవకతవకలు, పెద్దఎత్తున డబ్బు దారిమళ్ళింపు, చిట్ పాడుకున్న వారికి వెంటనే మొత్తాన్ని చెల్లించకపోవటం లాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంటే సేమ్ టు సేమ్ మార్గదర్శిలో రామోజీరావు, ఆయన కోడలు శైలజ ఎలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారో అలాంటివే ఇపుడు వీళ్ళూ ఎదుర్కొంటున్నారు.





ఆదిరెడ్డి అప్పారావు గతంలో ఎంఎల్సీగా పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో భవానికి బదులుగా శ్రీను ఎంఎల్ఏగా పోటీచేయటానికి రెడీ అవుతున్నారు. వచ్చేఎన్నికల్లో తన భార్యకు బదులు తానే పోటీచేస్తున్నట్లు కూడా శ్రీను ప్రచారం చేసుకుంటున్నారు. రాజమండ్రిలో వీళ్ళది బలమైన కుటుంబమనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గ్యారెంటీ అని చెప్పుేసుకుంటున్నారు. 





ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చిట్ మోసాలపై తండ్రి, కొడుకులు ఒకేసారి అరెస్టవ్వటంతో పార్టీకి ఇబ్బందైతే. అయితే వీళ్ళపైన ఉన్న ఆరోపణలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులంటు తమ్ముళ్ళు గోల మొదలుపెట్టారు. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేకే తండ్రి, కొడుకులను ప్రభుత్వం అరెస్టు చేయించిందని పాత రికార్డునే వినిపిస్తున్నారు. ప్రభుత్వంది కక్షసాధింపులనే అనుకుందాం. మరి వీళ్ళ చిట్ కంపెనీపై వచ్చిన ఆరోపణల గురించి ఏమిచెబుతారంటే మళ్ళీ ఎవరిదగ్గరా సౌండ్ ఉండదు. చూద్దాం చివరకు ఏమవుతుందో .


మరింత సమాచారం తెలుసుకోండి: