తెలుగు రాజకీయాలను సమూలంగా మార్చేస్తానని ప్రతినబూని ఎన్నికల రణరంగంలోకి దూకిన ప్రముఖ సినిమా నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ రణక్షేత్రంలో ఓటర్లు చుక్కలు చూపించారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయింది. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ అన్న నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసినా ఆయన కూడా వైసిపి ఫ్యాన్ జోరులో కొట్టుకుపోయారు. బీఎస్సీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనానికి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. 


తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు 800 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యేపై అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం రోజునే పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డిచింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి రాపాక ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌కుండానే ఆయ‌న వైసీపీలోకి లేదా బీజేపీలోకి వెళ్లిపోతార‌న్న పుకార్లు, షికార్లు చేశాయి. ఆయ‌న మాత్రం వాటిని ఖండిస్తూ వ‌స్తున్నారు. వైసీపీలోకి వెళితే త‌న నెంబ‌ర్ 152 అని.. అదే జ‌న‌సేలో ఉంటే త‌న నెంబ‌ర్ 1 అని కూడా చెప్పారు. 


తాజాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున రాపాక వరప్రసాదరావు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో పాటు... ఐదు నిమిషాలు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాపాక సీఎంతో అంతసేపు చర్చించడంతో వీరి మధ్య ఏయే ? అంశాలు చర్చకు వచ్చాయి... అన్నది సచివాలయ సర్కిల్స్ లో పెద్ద ట్రెండింగ్‌ న్యూస్‌గా మారింది. అమరావతి సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ప్రకారం రాపాక గోడ దూకడానికి ఎంతో కాలం పట్టదని తెలుస్తోంది. రాపాక వరప్రసాదరావుకు జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష‌ పెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్ ద‌య‌తో టిక్కెట్ ద‌క్కించుక‌న్న‌ వరప్రసాదరావు రాజోలు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 


ఇక ఈ ఎన్నికల్లో ఆయన జ‌న‌సేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు. జనసేనకు ఎలాగు భవిష్యత్ లేదని పవన్ కళ్యాణ్ వీరాభిమానుల‌కే అర్థమైంది. అలాంటి టైమ్‌లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక ఐదేళ్లపాటు జనసేన లో సింగిల్ ఎమ్మెల్యేగా మిగిలిపోతే... ఎలాంటి ఉపయోగం ఉండదని భావించి తాను పార్టీ మారనున్న విషయాన్ని జగన్ ముందు ఉంచారని తెలుస్తోంది.


జగన్ వైసిపి పెట్టినప్పటినుంచి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కండిషన్లు పెడుతున్నారు. పార్టీ మారే వారు తమ పార్టీ సభ్యత్వంతో పాటు.... ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు రాపాక‌ విషయంలో జగన్ అదే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాపాక జగన్ కండిషన్‌కు ఒప్పుకుని జనసేన సభ్యత్వంతో పాటు... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రాజోలులో తిరిగి ఉప ఎన్నిక అనివార్యం కాక తప్పదు. ఇక అదే టైంలో జనసేన పని అయిపోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: