చిత్తూరు జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. శాంతిపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగులు గ్రామ శివార్లలోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు గ్రామంలోకి వచ్చి తమపై ఎక్కడ దాడి చేస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని బెల్లకోగిళ గ్రామ సమీపంలోని ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా రామెగౌనెపల్లిలో హల్ చల్ చేస్తోంది. శాంతిపురం పరిసర గ్రామాలు ఏనుగుల గీంకారాలతో దద్దరిల్లుతున్నాయి. 
 
శాంతిపురం మండలం రామెగౌనెపల్లిలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏడు ఏనుగులతో కూడిన గుంపు ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేయటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనుగుల దాడుల్లో కొంతమంది రైతులు చనిపోయారు. ఏనుగుల వరుస దాడులతో గుడుగుల్లి, శాంతిపురం మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 
 
గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ ఏనుగులు దాడులు చేస్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏనుగులు పంటకు వేసిన డ్రిప్ సిస్టమ్ తో పాటు పైప్ లైన్లను కూడా ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని రైతులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. 
 
విచ్చలవిడిగా ఏనుగులు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉండగా రైతులు పండించిన పంటలు నాశనమవటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి, వరి, టమోటా పంటలు ఎక్కువగా నాశనం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాగి పంట కోతకు వచ్చినా ఏనుగులు సంచరిస్తూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లుతూ ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులు పంట పొలాలపై దాడులు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: