ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో పోరాటం మొదలుపెట్టారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం సహా అనేక సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేయడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. 

 

రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటం, అటు శాసన సభలో కూడా తమకు మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి సిద్దమయ్యారు. పెన్షన్ లు, రేషన్ కార్డులను తొలగించడం వంటి అంశాలను, అదే విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని రద్దు నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా చంద్రబాబు వ్యూహ రచన సిద్దం చేసారు. 

 

దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని, విస్త్రుత స్థాయి సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను కలుపుకోవడమే కాకుండా స్థానిక నాయకత్వాన్ని ముందుకి నడిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ లకు పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారు. మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. 

 

బుధవారం ఈ యాత్ర ప్రారంభించగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. మార్టూరు కి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. అలాగే ప్రజలు, కీలక నేతలు అందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. అటు కార్యకర్తలు కూడా అధినేత పిలుపుతో వ్యక్తిగత పనులను పక్కనబెట్టి మరీ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేసారు. దీనితో పోలీసులు కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. 

 

దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే నరకం చూస్తున్నారు. ఎన్నడు లేని విధంగా జగన్ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత చూడలేదని టీడీపీ నేతలు అంటున్నారు. రాజధాని మార్పు సహా అనేక నిర్ణయాలు జగన్ ని టార్గెట్ చేసే విధంగా చేస్తున్నాయి. 

 

అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా విమర్శలకు వేదికగా మారింది. చేసిన అప్పులను ఆస్తులు పెంచడానికి వాడకుండా సంక్షేమ కార్యక్రమాలను వాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే బయటకు తీసుకురావడం కష్టం అనే భావనలో రాజకీయ పరిశీలకులు కూడా ఉన్నారు. ప్రభుత్వ వేధింపులను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: