ఇటీవ‌ల కాలంలో ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గటం లేదు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి తిరిగి చేరతామా అనేది సందేహాస్పదమే. రాష్ట్రంలో సరాసరిన రోజుకు యాబైకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో స‌గానికిపైగా మృత్యువాతపడుతున్నారు. ప్రతి ఏటా వేల మంది మృతి చెందుతుండగా ఆ సంఖ్యకు రెట్టింపు లెక్కల్లో గాయాలపాలవుతున్నారు. 

 

రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు స‌రి క‌దా.. ఇంకా ఎక్కువ‌గా పెరుగుతున్నాయి. ఇక ఇటీవ‌ల కరీంనగర్‌, భువనగిరిలో కాల్వల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలు మరవకముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా నల్లగొండ జిల్లాలోని ఏఎంఆర్‌పీ లింక్‌ కెనాల్‌లోకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అదే కారులో ఉన్న ఓ బాలుడు కార్తీక్‌ని స్థానికులు రక్షించారు. 

 

వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్‌పీ లింక్‌ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కలిసి రఘు కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. క్రేన్‌ సాయంతో కాల్వలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు.  మృతులు పీఏ పల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మ‌రియు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఓ వివాహానికి హాజరై కుటుంబం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: