కడపలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన నిన్నటితో ముగిసింది. జిల్లాలోని చిన్నమండెం, పులివెందుల, చాపాడు, లింగాల, తొండూరు, వేంపల్లె స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులకు వైసీపీ 44, ఇండిపెండెంట్లు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ పులివెందులలోని అన్ని వార్డులు ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జమ్మలమడుగు మున్సిపాలిటీలో కూడా టీడిపీ నామినేషన్లు వేయలేదు. 
 
కడపలోని వేముల, సింహాద్రిపురం మండలాలలో జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వేంపల్లె మండలం జడ్పీటీసీ స్థానం, 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అని ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే మండలాల నాయకులతో సమావేశమై ఎన్నికల కోసం పక్కా ప్రణాళికను తయారు చేశారని తెలుస్తోంది. 
 
తుమ్మల మహేశ్వరరెడ్డి పులివెందులలో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినా ఎన్నికల అధికారులు వాటిని వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. పులివెందులలోని ఐదు ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కానున్నాయని తెలుస్తోంది. చక్రాయపేటలో కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేసినా వాటిని ఉపసంహరించుకున్నారు. 
 
చక్రాయపేటలో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తాడిగొట్ల శివప్రకాష్ రెడ్డి జడ్పీటీసీగా ఎంపిక కానున్నారు. ఇక్కడ 8 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ వశం కానున్నాయని తెలుస్తోంది. తొండూర్, లింగాలలో జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. కడపలోని మున్సిపాలిటీలకు 1,531 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ 681, టీడీపీ 265, బీజేపీ 99, కాంగ్రెస్ 44, జనసేన తరపున 25 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో టీడీపీ నామినేషన్లు కూడా వేయకపోవడంతో కడపలో కానరాని సైకిల్ అని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: