భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా లాక్ డౌన్ ని ప్రజలు అస్సలు పాటించడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు యదేచ్ఛగా తిరుగుతున్నారు. దాంతో పోలీసులు వారిని ఆపలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాంతంలో కూడా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు అవ్వట్లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇష్టారాజ్యంగా రోడ్ల మీదకి వస్తుంటే... పోలీసుల లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా అకస్మాత్తుగా రాత్రి సమయాల్లో ప్రజల సంచారం తగ్గిపోయే సరికి అడవి లో నివసిస్తున్న జంతువులు ప్రజల నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా తిరుమలలో కూడా ఒక పులి సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. 

 

 


మరోవైపు తెలంగాణ రాష్ట్రం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ పట్టణంలో కూడా ఒక పెద్ద ఎలుగుబంటి ప్రజలు ఉంటున్న ప్రాంతం లోకి వచ్చి ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దాంతో తెలంగాణ సర్కార్ ఆదేశించినట్టుగానే తప్పని పరిస్థితులలో లాక్ డౌన్ ని ప్రజలు పూర్తిస్థాయిలో పాటిస్తున్నారు. అయితే ఈ ఎలుగుబంటి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా... ఇలాంటి ఓ వంద ఎలుగుబంటులు రాష్ట్రమంతటా తిరిగితే... లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించారంటూ నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. 

 

 


ఇకపోతే కాగజ్ నగర్ లో సంచరిస్తున్న ఎలుగుబంటిని పట్టుకోవాలని స్థానిక ప్రజలు అటవీ అధికారులను డిమాండ్ చేయగా... వారు అక్కడికి రాగానే ఎలుగుబంటి ఒక వీధి నుండి మరో వీధిలోకి పారిపోయింది. అటవీ అధికారులు దాని ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరకకపోయేసరికి... అడవిలోకి పారిపోయి ఉండొచ్చని వాళ్ళు భావిస్తున్నారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం... ఎలుగుబంటి ఏదో ఒక మూలన ఇక్కడే దాక్కొని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వందల మంది పోలీసులు చేయలేని పనిని ఓ ఎలుగుబంటి చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఇలానే కొన్ని రోజులపాటు రోడ్లపైన జనసంచారం లేకపోతే ఇంకా ఎన్ని క్రూర మృగాలు బయటికివస్తాయో..!

మరింత సమాచారం తెలుసుకోండి: