ప్రభుత్వానికి ప్రజల భద్రతే ముఖ్యమని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ను సందర్శించిన మంత్రులు.. భయపడాల్సిన పనిలేదని స్థానికులకు ధైర్యం చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. 48 గంటల తర్వాత స్థానికులు ఎవరిళ్లకు వారు వెళ్లొచ్చని తెలిపారు. 

 

ఏపీ సర్కారుకి ప్రజలు ముఖ్యం కానీ.. కంపెనీ కాదన్నారు మంత్రులు. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. కరోనా తీవ్రత  దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలని మంత్రులు సూచించారు. సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. ఎల్‌జీ  పాలిమర్స్‌ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం  వైఎస్‌ జగన్‌ చెప్పారని మంత్రులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మం‍త్రులు తెలిపారు. 

 

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు చెప్పారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 48 గంటల తర్వాత నిపుణుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బాధితులందర్నీ ఇళ్లకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. 

 

ఎల్‌జీ పాలిమర్స్‌ను గ్యాస్‌ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.  నిపుణుల బృందం పరిశీలించాకే బాధితుల్ని ఇళ్లకు చేర్చే విషయమై తుది  నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 

 

ఇలాంటి సమయంలో సాధారణ పరిస్థితి రావడానికి అందరూ సహకరించాలని, బాధితుల్ని రెచ్చగొట్టే చర్యలకు ఎవరూ పాల్పడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో ధైర్యం నింపారు మంత్రులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: