రంగాల వారీగా... వివిధ వృత్తుల్లో స్థిరపడ్డవారిని గుర్తించి.. చేదోడుగా నిలవడానికి ఏపీ సర్కార్‌ వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా రూపొందించిందే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం. సుధీర్గ పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే అమల్లోకి వచ్చిన జగన్ బ్రాండ్‌ స్కీమ్‌ ఇది. 

 

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే... వృద్ధాప్య ఫించన్ల పెంపు ఫైల్‌ మీద తొలి సంతకం చేశారు. అయితే అమల్లోకి వచ్చిన జగన్‌ బ్రాండ్ పథకాల్లో మొదటిది మాత్రం.. వైఎస్సార్‌ వాహన మిత్రే అని చెప్పాలి. ఈ స్కీమ్‌ ద్వారా ఆటో డ్రైవర్లు కమ్‌ ఓనర్లకు ఆర్థిక సాయం అందిస్తోంది జగన్‌ సర్కార్‌. అర్హులైన వారికి పదివేల ఆర్థికసాయం అందిస్తున్నారు.

 

ఆటో డ్రైవర్లతో పాటు, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు కమ్ ఓనర్లు ఈ పథకానికి అర్హులు. లబ్దిదారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి.. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని పారదర్శకంగా అమలయ్యేలా చూసే బాధ్యత.. గ్రామ,వార్డు వలంటీర్ల మీద పెట్టింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌ 4న ప్రారంభమైన ఈ పథకం.. ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగు నింపింది. సొంతంగా ఆటో కొని.. డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న వారికి ఈఎంఐల విషయంలో.. ఈ వాహనమిత్ర పథకం సాయంగా ఉంటోంది.

 

గతేడాది ఈ పథకానికి మొత్తం 2లక్షల 36వేల 334 మంది లబ్దిదారులు ఎంపికయ్యారు. ఎంపిక విధానం సరళతరం చేయడంతో నిజమైన లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించడం సాధ్యమైంది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా.. సుమారు 8కార్పోరేషన్ల ద్వారా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరింది. గతేడాది ఒక లక్ష 5వేల 932 మంది బీసీలు, 54వేల485 మంది ఎస్సీలు, 8వేల762 మంది ఎస్టీలు, 25, 517 మంది మైనార్టీలు ఉన్నారు. వీరిలో 27వేల 107 లబ్దిదారులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, 931 మంది క్రైస్తవులు, 509 మంది బ్రహ్మాణులతోపాటు, ఇతర ఓసీలు 13వేల 91 మంది ఉన్నారు. వీరికి సుమారు 236 కోట్లకు పైగా చెల్లించింది ప్రభుత్వం. 

 

ఈ ఏడాది కూడా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది సర్కార్. ఈ నెల 18 నుంచి.. దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. లబ్ధిదారుల సంఖ్య ఈసారి మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. వచ్చే నెల 4న చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: