తమిళనాడు రాష్ట్రంలో ఒక అతి పెద్ద చోరీ జరిగింది.  శ్రీపెరంపుదూర్ ప్రాంతం నుండి ముంబైకి స్మార్ట్ మొబైల్ ఫోన్లను తీసుకెళ్తున్న ఓ పెద్ద లారీని ఆపి కొందరు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీ తో ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రం ఉలిక్కి పడింది అంటే అతిశయోక్తి కాదు. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. 2020 అక్టోబర్ 21 తేదీన ఏంఐ కంపెనీ నుండి వేల స్మార్ట్ ఫోన్లను ముంబై నగరానికి తీసుకెళ్లేందుకు ఒక పెద్ద లారీ తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఒక ప్రధాన నగరమైన హోసూర్ నుండి గమ్యస్థానానికి పయనమయ్యింది. తమిళనాడులోని శ్రీపెరుపుదూర్ ఇండస్ట్రియల్ సిప్కోట్ ప్రాంతంలో ఏంఐ(MI) మొబైల్ తయారీ కర్మాగారం ఉంది. ఈ కంపెనీని నుండే 15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ముంబై నగరానికి బయలుదేరాయని పోలీసు అధికారులు వెల్లడించారు.


బెంగుళూరు - సేలం రహదారిపై మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్న లారీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆపి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ అర్జున్ తో పాటు లారీ క్లీనర్ కుమార్ ని కూడా ఇష్టారాజ్యంగా కొట్టి సమీపంలో ఉన్న అడవి లోకి తీసుకెళ్ళి తాళ్లతో గట్టిగా కట్టేసి మొబైల్ ఫోన్ల లారీని ఎత్తుకెళ్లారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో లారీని ఆపి.. రిపేర్ వచ్చినట్టుగా ఒక బోర్డు పెట్టి.. లారీ లోని స్మార్ట్ మొబైల్ ఫోన్లను వేరే వాహనాల్లోకి ఎక్కించి.. అక్కడి నుండి ఉడాయించారు.


అయితే కుమార్, అర్జున్ సహాయం కోసం గట్టిగా అరవడంతో.. రోడ్డు మీద ప్రయాణించే కొందరు వాళ్ళ దగ్గరికి వచ్చి.. విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు చెప్పిన వివరాలను సేకరించి కంపెనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. లారీలో వేలిముద్రలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనం బట్టి చూస్తుంటే ఎప్పటినుండే ప్లాన్ వేసి ఉంటారని పోలీసులు సందేహిస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: