దేశ రాజకీయాలు ఒక్కసారిగా కరోనా వ్యాక్సిన్‌ వైపు మళ్లాయి. బీహార్‌లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ వ్యాక్సిన్ హామీపై ప్రతిపక్షాల ఎదురుదాడి మొదలు పెట్టాయి. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకమంటూ కౌంటర్ ఇస్తున్నాయి.

నిర్మలా సీతారామన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి‌. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్‌ను వాడుకుంటారా అని రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు.

ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి.. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రాని వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ప్రజల్లో ప్రాణభయం సృష్టించి దాన్ని ఓట్లుగా మల్చుకోవాలనుకోవడం అన్యాయమన్నారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు శశిథరూర్.

కశ్మీర్ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా బీజేపీ హామీపై మండిపడ్డారు. వ్యాక్సిన్ కు బీజేపీ డబ్బులు కడుతుందా అంటూ ప్రశ్నించారు. బీహార్‌లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరిస్తారని నిలదీశారు. విపక్షాలు ఎదురు దాడి చేయడంతో... ఎట్టకేలకు స్పందించింది బీజేపీ. వ్యాక్సిన్ ఎప్పుడొస్తే అప్పుడు ఉచితంగా బీహార్‌లో అందజేస్తామని వివరణ ఇచ్చింది.

 ఇటు తమిళనాడులోనూ ఉచిత వ్యాక్సిన్ ఫార్ములా మొదలు పెట్టారు సీఎం పళనిస్వామి. అసెంబ్లీ ఎన్నికల ముందు... ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశమే కాదు.. ఇటు అమెరికాలోనూ జోరుగా వ్యాక్సిన్ రాజకీయం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ వ్యాక్సిన్‌ చుట్టే ప్రసంగాలు ఇస్తున్నారు. అందరికంటే ముందు అమెరికన్లకు వ్యాక్సిన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకా మార్కెట్లోకి రాని వ్యాక్సిన్‌ను ఏ ధైర్యంతో అమెరికన్లకు ఇస్తామని ట్రంప్ ఎలా చెప్తున్నారని జోబైడెన్‌ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ ఇపుడు  రాజకీయాల్లో కాకరేపుతోంది.  









మరింత సమాచారం తెలుసుకోండి: