తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన త్రిసభ్య బెంచ్ ముందు కేసు విచారణ జరిగింది. అగ్రిగోల్డ్  సహా అనేక సంస్థలు లక్షల మంది డిపాజిటర్లను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్ర, తమిళనాడు, అండమాన్ నికోబార్ రాష్ర్టాలలో మోసం చేశాయని పిటిషన్ లో అసోసియేషన్ అధ్యక్షులు ఆండాళ్ రమేష్ బాబు పేర్కొన్నారు.

అగ్రిగోల్డ్ కేసును హైదరాబాద్ హైకోర్టు 2015 నుంచి విచారించి పలు ఆదేశాలు ఇవ్వగా గత ఏడాది మార్చి నుంచి కేసు విచారణ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, ఎపి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిన 1050 కోట్ల పంపిణీ కి ఆటంకం కలుగుతోందని పిటిషనర్ వాదించారు. అగ్రిగోల్డ్ సహా అనేక కంపెనీల ఆస్తులను ప్రభుత్వాలు అటాచ్ చేశాయి తప్ప వాటిని విక్రయించి డిపాజిటర్లకు తిరిగి చెల్లించడం లేదని పిటిషనర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్ల సేకరణ నిరోధక చట్టం-2019 తీసుకువచ్చినా అది దేశంలో అమలు కావడం లేదని పిటిషనర్  పేర్కొన్నారు.

కేంద్రం డిపాజిటర్ల సంక్షేమం కోసం తెచ్చిన చట్టాన్ని అమలు చేయడంతో పాటు, హైదరాబాద్ హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న తమ కేసులో 1050 కోట్లు ఎపి ప్రభుత్వం పంపిణీ చేసేలా, ఆస్తుల వేలం త్వరగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు పిటిషన్ లోని అంశాలపై పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ను వివరణ కోరారు. అగ్రిగోల్డ్ కేసు హైదరాబాద్ హైకోర్టు లో విచారణ జరగడమేకాక అనేక ఆదేశాలు ఇచ్చిందని మీరే చెబుతున్నారు,

కరోనా మహమ్మారి వల్ల కొంత కాలంగా విచారణ జరగకపోయుండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. హై కోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరితే ఎలా అని నిలదీశారు. హైకోర్టు నుంచి కేసు బదిలీ చేస్తే, పిటిషనర్ కేసుపై నోటీసు ఇస్తే ఇక్కడ మరో పదేళ్లు ఆలశ్యం అవుతుందని అన్నారు. దీనికి స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తాము హైకోర్టు నుంచి కేసును సుప్రీంకోర్టు కు బదిలీ కోరడం లేదని తెలిపారు. హైకోర్టులో పెండింగ్ కేసును త్వరగా విచారించమని సూచిస్తే చాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: