క్యాపిటల్‌ సిటీ విశాఖలో మెట్రో రైల్‌ను పరుగులు తీయించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లకు డీపీఆర్‌లు తుది దశకు చేరుకున్నాయి. ప్రజారవాణా, పర్యాటక అవసరాలకు అనుగుణంగా మల్టీ మోడల్ విధానంలో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరుగుతోంది. సాగరతీరానికి మణిహారం కానున్న మెట్రోరైలు తొలిదశను 2027నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

2014 నుంచి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు తెరపైకి రావడం... వెనక్కి వెళ్లడం.. జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో ప్రాజెక్టుకు సంబంధించి మూడు కారిడార్లతో డీపీఆర్ లు సిద్ధమయ్యాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తరణ చేపట్టింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మరింత ఆర్ధిక భారం కాకుండా చర్యలు చేపడుతోంది. లైట్ మెట్రో ద్వారా పీపీపీ పద్ధతిలో  కొంతవరకు ఆర్థిక భరోసా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక భారం అంతగాలేని దశలో త్వరితగతిన మెట్రో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కేవలం మెట్రో రైలు ప్రాజెక్టు మాత్రమే కాకుండా విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో కూడా ట్రామ్ రైలును కూడా ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదన కూడా తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో విశాఖ ప్రజల స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా పర్యాటకులను కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు ఆకర్షించనుంది.

విశాఖ మెట్రో రీజనల్ డెవలప్ మెంట్ ఏరియాలో 79.91 కిలోమీటర్ల లైట్ మెట్రో రైలు కారిడార్లు... 60 కిలోమీటర్ల మోడ్రన్ ట్రామ్ కారిడార్ల  అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ ల కోసం వేర్వేరుగా రెండు డీపీఆర్‌ల కోసం యుఎంటీసి కన్సల్టెంట్ లను సిద్ధం చేస్తోంది. ఇవి త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నాయి. ట్రాఫిక్ ఇతర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలోమీటర్లతో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని కన్సల్టెంట్లు సిఫార్సు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: