బీహార్ తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు సీనియర్ నేతల్లో కల్లోలం రేపుతున్నాయి. పార్టీ కోసం సర్వశక్తులు ధారబోసిన నేతలు.. పార్టీ పనితీరు చూసి రగిలిపోతున్నారు. ఇది ఎలా బాగు పడుతుందా అని ఆలోచిస్తున్నారు. బాగు పడాలని కోరుకుంటున్నారు.

బీహార్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసిన వారికి..  భవిష్యత్ గురించి భయం పుట్టడంలో ఆశ్చర్యం ఏముంది?. బీహార్  ఫలితాల తర్వాత కాంగ్రెస్‌తో  మరే పార్టీ అయినా చేతులు కలిపేందుకు సిద్ధపడుతుందా?. కాంగ్రెస్‌తో చేతులు కలపడం అంటే అత్మహత్య చేసుకోవడమే అన్నట్లుగా తయారైంది. లోక్‌సభలోప్రతిపక్ష హోదా లేకున్నా.. దేశంలో ప్రతిపక్షం ఎవరు అంటే అందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు.సీనియర్ నేతలు నేతలు పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. మంచిదే. హైకమాండ్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఏమీ నిన్నమొన్న పుట్టిన పార్టీ కాదు. పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇండియన్ పొలిటికల్ జాగ్రఫీని నమిలి జీర్ణించుకున్నవారికి కొరత లేదు. ప్రజలు బీజేపీ అంటే విసుగు పుట్టి కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలే తప్ప.. కాంగ్రెస్ స్వతహాగా ప్రజల మనసుని గెలుచుకోగలిగే సీన్ కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించినా.. బీజేపీ వ్యూహాల దెబ్బకు అధికారాన్ని కాపాడు కోలేకపోతోంది. గోవా, మణిపూర్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కర్నాటక, మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నిలబెట్టుకోలేక పోయింది.

ప్రస్తుతం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనవే. బీజేపీకి దారి చూపించింది కాంగ్రెస్ నాయకత్వమే. ఇందులో ఎవరూ సుద్దపూసలని చెప్పడానికి వీల్లేదు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.

బీహార్‌లోనే కాదు.. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. ఏడాది క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎన్సీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పోటీ చేసిన వాటిలో సగం సీట్లు కూడా గెలుచుకోలేక పోయింది. కాంగ్రెస్ వల్ల ఎన్సీపీ అవకాశాలు దెబ్బ తిన్నాయి. ఎన్నికలు ఏవైనా.. కాంగ్రెస్ స్వయంగా తాను దెబ్బతినడంతో పాటు సహచర పార్టీలను కూడా దారుణంగా దెబ్బ తీసే స్థాయికి దిగజారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: