వ్యాక్సిన్‌ వచ్చేసింది. ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌ బ్రిటన్‌ లో అందుబాటులోకి వచ్చేసింది. యూకె సర్కారు దీనికి అనుమతులు కూడా ఇచ్చేసింది. మరో వారంలో అక్కడి ప్రజలకు వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.  అదిగో కరోనా వ్యాక్సిన్.. ఇదిగో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందంటున్నారు. ఇప్పటివరకూ ట్రయల్స్ ఫలితాల్లో తమ వ్యాక్సిన్ సురక్షితమంటే తమది అంటూ డ్రగ మేకర్లు పోటీపడుతున్నారు. కరోనాకు విరుగుడు ఉంటే తప్ప ప్రపంచం సాధారణంగా మారే పరిస్థితి కనిపించటం లేదు. రెండొందలకు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతుంటే, వాటిలోకొన్ని కాండిడేట్లు మాత్రమే మూడోదశ ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఆక్స్ ఫర్డ్‌ తమ వ్యాక్సిన్ మంచి ఫలితాలిస్తోందని ప్రకటించి ప్రపంచానికి శుభవార్త చెప్పింది. అయితే ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ కు ఏకంగా అనుమతులు కూడా వచ్చేశాయి. దీంతో అధికారికంగా ఓ దేశంలో అనుమతులు పొందిన వ్యాక్సిన్ గా ఫైజర్, అనుమతించిన దేశంగా బ్రిటన్ నిలిచాయి.

వచ్చే వారంలోనే ఫైజర్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఫైజర్-బయోఎన్‌ టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన సిఫారసును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. యునైటెడ్ కింగ్‌ డమ్ వ్యాప్తంగా వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి సాధించడంపై ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము మరిన్ని దేశాల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత ఉన్న వ్యాక్సిన్లను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే బ్రిటన్లోని ఆసుపత్రులన్నీ వ్యాక్సిన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ముందుగా వైద్య సిబ్బందితో పాటు, కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వృద్ధులకు, అదీ 80ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే బ్రిటన్ 4 కోట్ల వ్యాక్సిన్లను ఆర్డర్ చేసింది. వీటిని 2 కోట్ల మందికి ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: