జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కాబోతోంది. అయితే కొన్ని గంటల ముందుగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీని నిద్రపోనివ్వడం లేదు. ఆరా గ్రూప్ సహా.. ఇతర అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ బైటపెట్టాయి. అన్నిటి సారాంశం ఒక్కటే. టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా మారుతుంది అని. అయితే అదే స్థాయిలో బీజేపీ కూడా పుంజుకుంటుంది అని తేలడంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.

100 స్థానాలు కైవసం చేసుకుని ఈసారి చరిత్ర తిరగరాస్తామని చెప్పుకుంటూ వచ్చారు టీఆర్ఎస్ నేతలు. కానీ ఎగ్గిట్ పోల్స్ లో ఏ ఒక్కటీ టీఆర్ఎస్ కి 100 స్థానాలు వస్తాయని చెప్పలేదు. 100 కాదు కదా కనీసం 90 కూడా దాటతాయని అంచనా లేదు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ తో టీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. గెలవడం ముఖ్యం కాదు, భారీ మెజార్టీతో గెలిచి, దుబ్బాక చేదు అనుభవాన్ని మర్చిపోవడం వారికి అత్యవసరం. అలాంటి సమయంలో బీజేపీకి గ్రేటర్ లో ఎక్కువ సీట్లు వస్తే తమ పరిస్థితి ఏంటని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.

అటు అధికారం హస్తగతం చేసుకుంటామనుకున్న బీజేపీకి కూడా ఎగ్జిట్ పోల్స్ అశనిపాతంలా మారాయి. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం గ్రేటర్ పోరులో ప్రచారం చేశారు. విజయంపై ధీమాతో, మరింత ప్రచారం లభిస్తే.. భారీ విజయం లభిస్తుందనే ఆశతో, దుబ్బాక ఫలితం ఇచ్చిన సపోర్ట్ తో రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం పెద్దల్ని రంగంలోకి దించారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి పెద్ద పెద్ద పదాలు వాడారు. ఉచిత హామీలు నోటికొచ్చినట్టు ఇచ్చేశారు. కట్ చేస్తే ఇక్కడ అధికారం అందేలా లేదు, కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా సీట్లు దక్కేలా లేవు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు, టీఆర్ఎస్ ప్రాభవాన్ని తగ్గించగలిగాం అని చెప్పుకోవాల్సిందే. అంతమాత్రానికే కేంద్ర మంత్రులతో ఆ హడావిడి ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే బీజేపీకి అవమానమే. టీఆర్ఎస్ కూడా కేంద్రంపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తో టెన్షన్ పడుతున్నాయి. రాగా పోగా ఒక్క ఎంఐఎం మాత్రమే తమ స్థానాలు తమకే ఉంటాయనే సంతోషంలో ఉన్నాయి. కాంగ్రెస్ కూడా గతంతో పోల్చి చూస్తే తమ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నందుకు కాస్త సంబరపడుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ తమ ఆశలకు ఆమడ దూరంలోనే ఆగిపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: