అమరావతి: సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ వేడుకలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రం అంతటా సంక్రాంతి కోలాహలం నెలకొని ఉంది. ఊరూ వాడా ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనపడుతోంది. డూడూ బసవన్నలు ఒకవైపు.. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు మరోవైపు చూడగానే మనకు కనువిందు చేస్తున్నాయి. కోలాటాలు, సంప్రదాయపు ఆటలతో పల్లెలు మారు మోగి పోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎలమదుర్రు గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ శివాలయంలో శివుడు తల కిందులుగా ఉంటాడు. ఇలా తల కిందకు, కాళ్లు పైకి పెట్టి తపస్సు చేస్తున్నట్లు శివుడు కనిపిస్తాడు. అలాగే పార్వతీ దేవి కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుమార స్వామికి పాలు పట్టిస్తూ దర్శనం ఇస్తుంది. ఇక్కడ యువతీ యువకులు ఏటా సంక్రాంతి సందర్భంగా ఆలయం ముందు కోలాటం ఆడుతుంటారు. ప్రతి సంక్రాంతి సమయంలో ఇక్కడ కోలాటం ఆడటం సంప్రదాయం. అలాగే హరిదాసులు, సంకీర్తనలు, గంగిరెద్దు మేళాలు.. ఇవన్నీ సంప్రదాయంగా జరుపుకోవడం విశేషం.

అలాగే ఇక్కడి ఆలయంలో ఓ ప్రత్యేక సంప్రదాయం ఉంది. అదేంటంటే.. ఆలయంలో ప్రసాదం తయారు చేయడానికి పక్కనే ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకు వస్తారు. ఈ నీటితోనే దేవుడికి ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా పెట్టడం ఇక్కడి ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇక్కడ ఉన్నట్లు శివుడు తల కిందులుగా మరెక్కడా ఉండడని, అలాగే పార్వతీ దేవి కూడా ఇలాంటి రూపంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. ఏది ఏమైనా ఎప్పుడూ వెళ్లే ఆలయాల్లోలా కాకుండా ఇక్కడకు తొలిసారి వెళ్లిన భక్తులకు కచ్చితంగా ఓ కొత్త అనుభూతి కలుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: