ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దేవాలయాలపై దాడుల అంశం సంచలనంగా మారింది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాలయాల విధ్వంసకుడు పాస్టర్‌ ప్రవీణ్‌ చర్యల్ని కొడాలి నాని సమర్థిస్తున్నాడా? వైకాపా ఎందుకు ఖండించదు...? అని నిలదీశారు. 2019 డిసెంబర్‌ 23 న పాస్టర్‌ ప్రవీణ్‌ 699 హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని, ఆ గ్రామాలలో ఉన్న రాతి దేవుళ్లను, వన దేవతలను కాలితో తన్నానని, విగ్రహాల తలలు నరికేశానని బహిరంగంగా ప్రకటించాడు అని మండిపడ్డారు.

బూతుల మంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారు?  అని నిలదీశారు. నీ బూతులతో గౌరవప్రదమైన మంత్రి స్థానాన్ని పాతాళానికి దిగజారుస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్‌టిఆర్‌ కు ఎదురుపోటు పొడిచిన లక్ష్మీ పార్వతిని ప్రక్కన పెట్టుకొన్న జగన్‌ రెడ్డికి, ఆయన పార్టీకి ఎన్‌టిఆర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు అని ఆరోపించారు. తాడేపల్లిలో సీయం గారి ఇంటి సమీపంలో ఈ మధ్య కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ గ్యాంగ్‌ వీర విహారం చేసింది మీ పాలనలో కాదా? అని ప్రశ్నించారు. నమ్మి సంతకాలు పెట్టిన అధికారుల్ని జైళ్లకు పంపింది వైయస్‌ కుటుంబం కాదా? అని ఆయన నిలదీశారు.

అధికారుల ప్రతిష్ట మంట గలిపింది జగన్‌ రెడ్డి ధన దాహం, అధికార దాహం కాదా? అని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన, దేవాలయాల్ని ధ్వంసం చేసిన పాస్టర్‌ ప్రవీణ్‌ పై తీవ్రమైన  చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్‌ ను అరెస్టు చేశారా? లేదా? ఏ సెక్షన్‌ల కింద కేసు పెట్టారు? కొడాలి నాని సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: