విజయవాడ: ప్రపంచాన్ని ఒక పక్క కరోనా మహమ్మారి భయపెడుతూనే ఉంది. మరోపక్క కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యాక్సిన్ కూడా అనేక దేశాల్లో మార్కెట్‌లోకి వచ్చేసింది. భారతదేశంలోనూ ఇటీవల వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. భారత్‌లోని అనేక రాష్ట్రాలకు పూణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్ బాక్సులు చేరుకోవడం వ్యాక్సిన్ వేయడం కూడా జరుగుతోంది. ఏపీలోనూ జనవరి 16 నుంచి అధికారులు కరోనా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. 16, 17, 18 మూడు రోజుల్లో కలిపి 46,755 మందికి వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చినట్టు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటగా ఏపీకి మొత్తం 4,97,000 కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

వాటితో పాటు మంగళవారం భారత ప్రభుత్యం పూణే నుంచి మరో 4,08,500 కోవిషిల్డ్ వాక్సిన్లను ఏపీకి పంపారు. ఈ రెండిటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9,05,500 కోవిడ్ టీకాలు ఏపీకి చేరుకున్నాయి. ఇందులో కోవిషిల్డ్ 8,85,500 వ్యాక్సిన్లు కాగా కోవాక్సిన్ డోస్‌లు 20 వేలుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. 13 జిల్లాల్లో మొత్తంగా 332 కేంద్రాలలో ‌వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మొదటి ఫేస్‌లో కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్లకే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి పొరపాట్లు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న కొంత మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించాయి.

అయితే అవి సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ అని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వచ్చే వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని అధికారులు వారికి సూచనలు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: