హైదరాబాద్: నచ్చిని నాయకుడిని ఎన్నుకోవాలన్నా.. ఇష్టమైన పార్టీకి మద్దతు తెలియజేయాలన్నా.. రాష్ట్రాన్ని గొప్పగా పాలించే ప్రభుత్వం రావాలన్నా ప్రజల ద్వారానే సాధ్యమవుతుంది. ఆ శక్తిని వారికి అందించే ఆయుధం. ఓటుహక్కు. అయితే ఈ ఓటు కార్డు పొందాలంటే ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడాల్సి వచ్చేది కానీ ఇకనుంచి అంత కష్టం పడాల్సిన అవసరం లేదు. నేరుగా మీ చేతిలోని మొబైల్ ద్వారానే ఓటర్ కార్డును పొందవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు తమ మొబైల్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకొనేలా భారత ఎన్నికల సంఘం(ఈసీ) ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్‌ ద్వారా తమ ఓటరు కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపు(సోమవారం) ఈ-ఎపిక్‌(ఎలక్ట్రానిక్‌ ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి నేడు(ఆదివారం) ప్రకటన వెలువడింది.

సదరు వ్యక్తి తమ మొబైల్‌లోనే ఓటరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, ఎక్కడైనా ప్రింట్‌ తీసుకోవచ్చునని ఈసీ వెల్లడించింది. ఈ-ఎపిక్ విధానంపై ఓటర్లలో అవగాహన పెంచాలని ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు ఎస్ఈసీ పేర్కొంది. సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు కొత్తగా నమోదైన ఓటర్లు తమ తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ల ద్వారా ఈ- ఎపిక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించామని, ఫిబ్రవరి 1 నుంచి మిగతా ఓటర్లు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. దీనికి సంబంధించి 'ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఏపిక్' పేరుతో ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. కాగా సోమవారం నుంచి ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓలను భాగస్వాములను చేసి కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృత ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

పోర్టల్ ద్వారా: http://voterportal.eci.gov.in, NVSP:https://nsvp.in
ఓటర్ హెల్ప్ లైన్, మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా: https://play.google.com/store/apps/details?id=com.eci citizen
ఐఓఎస్ ద్వారా: http://apps.apple.com/in/app/voter-helpline/id1456535004 ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: