గృహహింస, ప్రేమ, వరకట్న వేధింపులు, లైంగికదాడులు నిత్యం ఏదో ఒక చోట నుంచి వినాల్సి వస్తోంది. కన్న వాళ్ళను కాదనుకొని, తాళి కట్టిన భర్తే సర్వస్వం అనుకోని మెట్టినింటికి వస్తుంది. కానీ ఆమె ఆశలకు నీరుగారుస్తూ చివరకు వేధింపులతోనే భర్త వారిపైకి యమపాశం వదులుతున్నాడు.  వరకట్న దాహాగ్నిలో అబలలు ఆహుతులవుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో నవ వధువు వరకట్న పిశాచానికి బలైంది. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికలో చోటుచేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన వాకదాని వెంకట కృష్ణ రెండేళ్లు గా తాడికల్ లో ఉంటూ ఊరురా తిరిగి ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నవంబర్ లో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపూర్ కు చెందిన కవిత (19)తో అతనికి వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచే వెంకట కృష్ణ వరకట్న పిశాచం మెలకొంది. అప్పటినుంచే అదనపు కట్నం తేవాలని కవితను మానసికంగా హింసించేవాడు. అతని వేధింపుల్ని తట్టుకుంది. అప్పుడప్పుడూ ఆమెను శారీరకంగా కూడా హింసించేవాడు.

ఈ తరుణంలో అతని వేధింపులు భరించలేకే ఆమె మంగళవారం ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు తహసీల్దార్ శ్రీనివాసరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి శైలజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కిరణ్ తెలిపారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను వెంకటకృష్ణనే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కన్న బిడ్డ చనిపోయిందని ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రులు బాధను చూసిన స్థానికులు కూడా విషాదంలో మునిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: