అతి చేస్తే ఎపుడూ రివర్స్ అవుతుంది. అది ఎక్కడైనా చెల్లని నాణెమే. అయితే అతి ఉత్సాహంతో ఒక పార్టీ తిరుపతిలో చేసిన హడావుడికి జనాలు ఏ రకమైన బహుమానాలు ఇవ్వబోతున్నారు అన్నదే ఇపుడు ఆసక్తిని కలిగించే అంశగా ఉంది.

తిరుపతిలో బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ పార్టీ గెలుపు మాదే అన్న తీరున రెచ్చిపోయింది. మేమే రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని కూడా గర్జించింది. దానికి తిరుపతిని ముఖద్వారంగా మార్చుకుంటామని కూడా బిగ్ సౌండ్ చేసింది. తిరుపతి విషయంలో బీజేపీ పెట్టుకున్న ఆశలు అంచనాలు అన్నింటికీ ఒకే ఒక్క ఆధారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి ఒకే ఒక్కసారి వచ్చారు. ఆ తరువాత ఆయన మళ్ళీ ఆ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు. అయితే బీజేపీ మాత్రం తమకు క్రౌడ్ పుల్లర్ గా పవన్ ఉన్నాడని ఆశపడింది. హడావుడి చేసింది. చివరికి పవన్ కరోనా పేరిట క్వారంటైన్ కి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఆయన విషయంలో ఏమీ అనలేని పరిస్థితి ఉంది.

మరో వైపు చూసుకుంటే తిరుపతి సీటు విషయంలో పట్టుబట్టి మరీ సాధించిన బీజేపీ ఏపీ పెద్దలు కేంద్రానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడ్డారని అంటున్నారు. బీజేపీకి ఏపీలో ఉన్నదే అంతంత బలం. దానికి తోడు వచ్చిన ఒకే ఒక మిత్రుడు పవన్ మీద స్వారీ చేయాలని చూడడం కూడా రాంగ్ పాలిటిక్స్ అంటున్నారు. అది చివరికి తిరుపతిలో బీజేపీకి చాలా చిక్కులే తెచ్చిపెడుతోంది అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా తిరుపతి బరిలో బీజేపీ గట్టిగా ఓట్లు సాధిస్తుందా అన్న చర్చలే ఉన్నాయి. మరి ఏదైనా అద్భుతం జరిగితేనే తప్ప బీజేపీకి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాలవు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి తిరుపతి ఫలితం మీద కమలనాధులలో కంగారు అపుడే మొదలైంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: