దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమయంలో టీకాల సంఖ్యను భారీగా పెంచాల్సిన కేంద్రం.. ముందుచూపుతో వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులవుతున్నా.. దాని ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించలేదు. ఫలితంగా ఇప్పుడు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో టీకా అందుబాటులో లేకుండా పోతోంది. తెలంగాణలో టీకా నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి.


ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల్లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు శనివారానికే అయిపోయాయని అధికారులు చెబుతున్నారు. అందుకే  ఆదివారం ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉండదని ప్రకటించాయి. ఆదివారం రాత్రికి 2.7 లక్షల డోసులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని.. అవి వస్తేనే మళ్లీ రాష్ట్రంలో టీకాలు ఇవ్వగలమని అధికారులు చెబుతున్నారు. టీకాలు సమయానికి వస్తే.. సోమవారం నుంచి షెడ్యూలు ప్రకారం యథావిధిగా టీకాలు కొనసాగుతాయని చెబుతున్నారు.


వ్యాక్సిన్ల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామంటున్నారు అధికారులు. తొలిదశ వ్యాక్సిన్‌ డోసు తీసుకున్నవారికి రెండోదశ డోసు ఇచ్చిన తరువాత మిగతా వారికి వ్యాక్సిన్లు అందిస్తామంటున్నారు.  ఇప్పటికే 28 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని... 25 లక్షల మందికి మొదటిడోసు పూర్తయిందని చెబుతున్నారు.  రోజుకు 1.5 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినా జూన్‌ నాటికి లక్ష్యం నెరవేరుతుందని గుర్తు చేస్తున్నారు.


ఇప్పటికే తెలంగాణలో వ్యాక్సిన్‌ 25 శాతం పూర్తయిందంటున్న అధికారులు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మకుండా ఏదైనా సమాచారం కోసం 104కి ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. రెండోదశ కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉందని, వైరస్‌ ప్రజల్లోకి వ్యాపించిందని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 1.25 లక్షల పరీక్షలు చేస్తున్నామని, దేశంలో పాజిటివ్‌ రేటు 5.48 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 2.98గా ఉందన్నారు. రానున్న రోజుల్లో పరీక్షల సంఖ్యను పెంచుతామని శ్రీనివాసరావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: