కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. రూపు మార్చుకున్న వైరస్ .. వైద్యులకు కూడా తొందరగా చిక్కడం లేదని తెలుస్తోంది. కరోనా అని గుర్తించేలోపే రోగులు సీరియస్ కండీషన్ లోకి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. మొదటి దశలో పాజిటివ్‌ వస్తే లక్షణాలు స్పష్టంగా తెలిసేది. సెకండ్‌ వేవ్‌లో మాత్రం కరోనా బారినపడ్డ వారిలో అంతుపట్టని లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరికి 3-4 రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి.. మళ్లీ వస్తోంది. ఇంకొందరిలో తీవ్రమైన నీరసం, దమ్ము, ఛాతీలో అసహజంగా ఉంటోంది. పలువురిని తలనొప్పి, వెన్నునొప్పి, గొంతు నొప్పి బాధిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై మచ్చలు, నోటిలో పొక్కులు, ఆకలి లేకపోవడం, విరోచనాలు వంటి లక్షణాలు కూడా చాలామందిలో బయటపడుతున్నాయి. తమకు ఇన్ఫెక్షన్‌ సోకిందా ? లేదా ? అనేది అనుమానితులు సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దీంతో మూడు రోజుల్లోనే రోగి ఆరోగ్యం విషమిస్తోంది. పైకి బాగానే కనిపిస్తున్నా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయి.

కొవిడ్‌-19 లక్షణాలున్నా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ‘నెగెటివ్‌’ వచ్చిన ఎంతోమంది.. సీటీ స్కాన్‌లు చేయించుకుంటున్నారు. దీంతో అప్పటికే ఇన్ఫెక్షన్‌ వల్ల వారి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని వెల్లడవుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి ఈ తరహా కేసులు భారీగా పెరిగాయి. అంతేకాదు ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో సీటీ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువగా చూపుతోంది. కరోనా మొదటి వేవ్‌లో సీటీ వ్యాల్యూ 30 వరకు ఉండేదని, 20 రావడమనేది చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. సీటీ వ్యాల్యూలో నంబరు ఎంత ఎక్కువగా ఉంటే వైరల్‌ లోడ్‌ అంత తక్కువని అర్ధం. ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో కొన్ని కేసుల్లో సీటీ వ్యాల్యూ 16 కూడా వచ్చిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కరోనా కేసుల్లో 80 శాతం ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడనివే ఉంటున్నాయి. వైరస్‌ సోకిన తర్వాత నాలుగు దశలు ఉంటాయి. మొదటిది వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌. ఈ సమయంలో శరీరంలో వైరస్‌ వ్యాప్తి మొదలవుతుంది. రెండో దశ పైరిమియాలో.. శరీరంలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. మూడోదశ ఎర్లీ పల్మనరీలో.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ప్రారంభమవుతుంది.

నాలుగోదైన లేట్‌ పల్మనరీ దశలో ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. తొలివేవ్‌లో వైరస్‌ సోకిన తర్వాత 5 రోజులు ఇంక్యుబేషన్‌కు పట్టేది. ప్రస్తుతం అది మూడు రోజులే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ‘పాజిటివ్‌’ వచ్చి ఎంత ఆరోగ్యంగా ఉన్నవారైనా మూడు నాలుగు రోజుల్లోనే కుప్పకూలుతున్నారు. అందుకే ‘పాజిటివ్‌’ కాంటాక్టులను 72 గంటల్లోనే పట్టుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. జ్వరం, పొడి దగ్గు... నీరసం, తలనొప్పి, వెన్నునొప్పి, తీవ్ర నీరసం, దమ్ము, ఛాతీలో అసహజంగా ఉండటం, మొదటి 3-4 రోజులు జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ వస్తే ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు. వెంటనే అప్రమత్తం కావాలి.  జ్వరం మాత్రలు వేసుకున్నాక కూడా తగ్గకపోతే తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: