ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు ఎవరంటే మనకు మొదట గుర్తొచ్ఛే పేరు బిల్ గేట్స్. ఆయనే మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు. బిల్ గేట్స్ ఈమధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. అందుకు కారణం ఆయన తన భార్య నుండి విడిపోవడమే. 27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత బిల్ గేట్స్, అతని భార్య మెలింద గేట్స్ తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు

అయితే బిల్‌ గేట్స్‌‌ జీవితంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బిల్ గేట్స్ తన భార్యకు తెలియకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని, అందుకే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్ గేట్స్ వైదొలిగారని వార్తలు వస్తున్నాయి. బిల్ గేట్స్ తన తోటి ఉద్యోగినితో వివాహేతర సంబంధం కొనసాగించారని, ఆ కారణంగానే తన భార్య మెలిండా గేట్స్‌ తో ఆయన విడిపోయారనే ప్రచారం జరుగుతోంది.

గతేడాది మార్చి 13వ తేదీన మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌ గేట్స్ తప్పుకున్నారు. తన తోటి ఉద్యోగినితో పెట్టుకున్న వివాహేతర సంబంధం కారణంగా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్  బోర్డు నుంచి తప్పుకొన్నారని తెలుస్తోంది. బోర్డు సభ్యులంతా నిర్ణయం తీసుకుని బిల్ గేట్స్ పై ఒత్తిడి పెంచారని, అందుకే ఆయన వైదొలగాడనే వార్తలు వచ్చాయి. దీనిపై ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

మైక్రోసాఫ్ట్‌ లో పనిచేస్తోన్న ఓ మహిళా ఇంజినీర్‌ తో బిల్‌ గేట్స్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారనే విషయం 2019లో వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ తనకు ఇష్టం లేకపోయినా.. బిల్ గేట్స్ తనతో సెక్సువల్ రిలేషన్‌ ను కొనసాగించాడని ఆరోపిస్తూ బోర్డుకు లేఖ రాసింది. దీంతో ఈ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ బోర్డు ప్రత్యేకంగా ఓ థర్డ్‌ పార్టీ న్యాయ విభాగంతో విచారణ జరిపించగా.. సదరు మహిళ చేసిన ఆరోపణలు నిజమేనని తెలిసింది.

ఆ మహిళా ఇంజినీర్‌ తో బిల్ గేట్స్ 20 ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని బిల్‌ గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బిల్‌గేట్స్ బోర్డు నుంచి తప్పుకోవడానికి, ఆ మహిళతో ఉన్న ఎఫైర్ కి ఎలాంటి సంబంధం లేదని ఆ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ విడాకులకు కూడా ఆ మహిళతో ఉన్న సంబంధం కారణం కాకపోవచ్చని అంచనా వేసినట్లు స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: