ఏపీ రాజకీయాలు గత పదేళ్ళుగా ఏ మాత్రం మారడం లేదు. అవతల పక్క చంద్రబాబు ఉంటే ఇవతల జగన్ ఉన్నారు. మరో వైపు చూస్తే జగన్ తానూ తన పార్టీ అన్నట్లుగా వేరుగానే ఉంటారు. ఆయనకు ఇతర పార్టీలతో ఏ రకమైన రాజకీయ సంబంధాలు లేవు.

ఆయన ఎవరితోనూ దోస్తీ కట్టరు. అదే విధంగా ఎవరినీ దగ్గరకు చేరనీయరు. విపక్షం లో ఉన్నపుడు కూడా ఆయన ఎపుడూ కూటములు కట్టలేదు. అలాగే అధికారంలో ఉన్నపుడు లౌక్యంగా పాలన సాగించడానికి కొన్ని పార్టీలను మచ్చిక చేసుకోలేదు. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ యాంటీ జగన్ పాలసీని గట్టిగా  అమలు చేస్తోంది. మిగిలిన పార్టీలను ఈ క్యాంప్ లోకి తేవడంలో విజయం సాధించింది. గతంలో బీజేపీ కొంత తటస్థంగా ఉండేది. కానీ ఇపుడు బీజేపీ కూడా జగన్ మీద విరుచుకుపడుతోంది. అలాగే వామపక్ష పార్టీలలో సీపీఎం మాత్రం న్యూట్రల్ గా ఉంటే సీపీఐ బాబు టీడీపీతో పాటే అడుగులు వేస్తోంది.

ఇక జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి యాంటీ జగన్ అనే దాని మీద నిలబడి ఉన్నారు. ఆయన బీజేపీతో ఉన్నా వామ‌పక్షాలతో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో స్నేహం చేసినా తన వైసీపీ వ్యతిరేక సిద్ధాంతాన్ని మాత్రం వీడలేదు. ఈ నేపధ్యంలో ఏ చిన్న సమస్య వచ్చిన ఏపీలో విపక్షాలు అన్నీ కలసి అధికార పార్టీ మీద దాడి చేస్తున్నాయి. ప్రభుత్వం అందరికీ కలసి జవాబు చెప్పాల్సి వస్తోంది.

అయితే ఈ రకమైన రాజకీయం మంచిదేనా  అంటే వైసీపీకే ఇది మేలు చేస్తుంది అంటున్నారు. ఏపీలో జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా ఉంటే కచ్చితంగా జగన్ కి పడాల్సిన ఓట్లు ఆయనకే పడతాయి. వ్యతిరేక ఓట్లలోనే చీలిక వస్తుంది అంటున్నారు. ఈ రోజు జగన్ వ్యతిరేక కూటమిలో బీజేపీ వామపక్షాలు కాంగ్రెస్ ఉండలేవు. ఒకరు ఉంటే మిగిలిన వారు వేరు పడతారు. దాంతో చంద్రబాబు అన్ని పార్టీలని కలిపి గ్రాండ్ అల‌యెన్స్ ఏర్పాటు చేయాల‌నుకున్నా కుదరదు అంటున్నారు. అదే సమయంలో చూసుకుంటే ఈ చీలిక వల్ల అధికార పక్షం రాజకీయంగా లాభ పడుతుంది అన్న వాదన ఉంది. ఇంకో వైపు అన్నీ పార్టీలు కలిపి దాడి చేస్తూంటే సహజంగా సానుభూతి కూడా వైసీపీకి ఉంటుంది అంటున్నారు. మరి అంతా కలసి జగన్ మీద పోరు చేయాలని బాబు వ్యూహం రూపొందిస్తున్నారు కానీ అది వర్కౌట్ అయి కూటమికి లాభిస్తుందా అన్నది 2024 ఎన్నికలే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: