ఆగస్టు మొద‌టివారం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ ప్ర‌క‌టించారు. దీంతో న‌రేంద్ర‌మోడీ స‌ర్కార్ ఇర‌కాటంలో ప‌డింది. పెగాస‌స్ సాఫ్ట్ వేర్ ద్వారా దేశంలోని ప్ర‌తిప‌క్ష నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా 50వేల మంది మొబైల్ ఫోన్ల‌ను కేంద్రం ట్యాప్ చేస్తోంద‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌దిరోజులుగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ద‌ద్ద‌రిల్లుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్ర‌ధాన‌మంత్రి మాత్రం నోరు విప్ప‌డంలేదు.

మినిట్స్ బుక్‌లో సంత‌కం చేయ‌ని బీజేపీ ఎంపీలు
ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి విచార‌ణ జ‌రిపించాలంటూ ఆదేశాలివ్వ‌మ‌న్నా కేంద్ర స‌ర్కారు పెడ‌చెవిన పెడుతోంది. రెండురోజుల క్రితం పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యిస్తే మినిట్స్ బుక్‌లో బీజేపీ ఎంపీలు సంత‌కం కూడా చేయ‌లేదు. దీన్నిబ‌ట్టి ట్యాపింగ్ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని ప్ర‌జ‌ల‌కు కూడా స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ట్యాపింగ్‌కు సంబంధించి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌డం కూడా అర్థ‌ర‌హిత‌మ‌ని తేల‌డంతో కొంద‌రు సుప్రీంకోర్టులో కేసులు దాఖ‌లు చేశారు. విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు ఆగ‌స్టు మొద‌టివారంలో విచారిస్తామ‌ని తేల్చింది. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణ‌యంతో న‌రేంద్ర‌మోడీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల మాట‌ను ఎలాగూ లెక్క‌చేయ‌డంలేదుకాబ‌ట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాల‌న‌న్నా క‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టులో కేంద్రానికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు
కేసు విచార‌ణ‌లో భాగంగా సంబంధిత రికార్డుల‌న్నీ కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశిస్తే కేంద్ర ప్ర‌భుత్వం ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. సుప్రీంకోర్టులో కేంద్రానికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును కూడా కోర్టు అడ్డుకుంది. అలాగే క‌రోనా తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. అప్పుడుకానీ కేంద్ర ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రాలేదు. పెగాస‌స్ విష‌యంలో కూడా సుప్రీంకోర్టు నిర్ణ‌యం మోడీకి షాక్ అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నారు కాబ‌ట్టి అందులో క‌చ్చితంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నెంబ‌రు కూడా ఉంటుంద‌నేది ప్ర‌జ‌లంద‌రి న‌మ్మ‌కం. మున్ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

tag