మాజీ మంత్రి, విశాఖ‌జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి ప‌లుమార్లు ఎన్నికైన సీనియ‌ర్ నాయ‌కులు.. టీడీపీ దిగ్గ‌జ నాయ‌కుడిగా పేరున్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ర‌గిలించిన వివాదం.. ఇప్ప‌టికీ.. ర‌గులుతూనే ఉంది. మాజీ స్పీక‌ర్‌, దివంగ‌త.. కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర్ధంతి స‌భ‌కు వ‌చ్చిన ఆయ‌న న‌కిరిక‌ల్లులో సీఎం జ‌గ‌న్‌పైనా.. మంత్రి సుచ‌రిత పైనా చేసిన వ్యాఖ్య‌లు ఓ రేంజ్‌లో దుమారం రేపాయి. ఇవి ఏకంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే డిమాండ‌తోపాటు.. ఆయ‌న ఇంటిపై దాడికి కూడా వైసీపీ నాయ‌కులు య‌త్నించారనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి. మ‌రి దీనికి కార‌ణ‌మైన‌.. అయ్య‌న్న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోలేదు.

ఇదిలావుంటే.. అస‌లు అయ్య‌న్న‌తో టీడీపీకి ఒరిగింది ఏంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న అయ్య‌న్న పాత్రుడు.. గీత దాటార‌నే భావ‌న టీడీపీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్య‌క్తం అవుతోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అయ్య‌న్న చేసిన ప్ర‌తి ప‌నీ కూడా విమ‌ర్శ‌ల‌కు, వివాదాల‌కు దారి తీస్తోంద‌ని.. పార్టీ నేత‌లే చెబుతున్నారు. సొంత ఇంట్లోనే రాజ‌కీయ క‌ల‌హాలు పెరుగుతున్నా.. ఆయ‌న నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోనీ.. టీడీపీని గాడిలో పెట్టేందుకు ఎలాంటి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌కుండా.. పార్టీని డ్యామేజ్ చేసేలా వ్య‌వ‌హ‌రించార‌నేది సీనియ‌ర్ల పెద్ద విమ‌ర్శ‌.

ఈ క్ర‌మంలోనే జిల్లాకు చెందిన నాయ‌కులు కూడా అయ్య‌న్న‌ను వెనుకేసుకు వ‌చ్చిన ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. అంతేకాదు.. సీనియ‌ర్లు.. బుచ్చ‌య్య చౌద‌రి కానీ, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై స్పందించ‌లేదు. దీనిని బ‌ట్టి అయ్య‌న్న వ్య‌వ‌హారంపై అంద‌రూ అసంప్తితో ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, టీడీపీ ప‌రంగా చూసుకున్నా.. అయ్య‌న్న చేసిన వ్యాఖ్య‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ సంపాయించుకున్న‌.. అంటే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్ప‌డిన డ్యామేజీ నుంచి పార్టీ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది.

ఈ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌నుతిట్టి.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో సానుభూతిని క‌ల్పించార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో టీడీపీ సంపాయించుకున్న ఇమేజ్ పూర్తిగా నేల‌మ‌ట్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న వ‌ల్ల పార్టీకి ఒరిగిందేంట‌ని.. సీనియ‌ర్లే ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: