త్వ‌ర‌లోనే  తెలంగాణ‌లోకి బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కొత్త‌గా ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది ప్ర‌భుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. యూరప్‌, అమెరికా వంటి దేశాలతో పాటు ఏషియాలో జపాన్‌, చైనాలలో ఎప్ప‌టి నుంచో బుల్లెట్ ట్రైన్‌లు ప‌రుగెడుతున్నాయి. భార‌త్‌లో ఇప్పుడిప్పుడే బుల్లెట్ ట్రైన్‌ పనులు మొద‌ల‌య్యాయి.  


బుల్లెట్ రైల్‌ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా  కొత్తగా నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.  ఈ సం‍స్థ తొలిసారిగా ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరంతో తొలి బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టు ప‌నులు స్వీక‌రించింది.  అలాగే, ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభ‌మ‌వ‌గా.. మ‌రిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణ‌యం తీసుకుంది ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ.


 అందులో భాగంగా  ఢిల్లీ - వారణాసి, ఢిల్లీ - అమృత్‌సర్‌, ఢిల్లీ - అహ్మదాబాద్‌, చెన్నై - బెంగళూరు - మైసూరు, ముంబై - హైదరాబాద్ మ‌ధ్య కూడా బుల్లెట్ ట్రైన్ మార్గాలు ఉన్నాయి.  మొత్తానికి భ‌విష్య‌త్తులో బుల్లెట్‌ ట్రైన్‌ నిడివిని 4,109 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా చేసుకున్నారు.   ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు మొత్తం 717 కిలోమీటర్ల మేరకు బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్ నిర్మాణం చేప‌డుతారు.  అలాగే,  మొత్తం 11 స్టేషన్లు నిర్మించే అవ‌కాశం ఉంది.


ఈ మార్గంలో ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌, పూనే, లోనావాలా, పండరీపూర్‌, షోలాపూర్‌ తదితర స్టేషన్లు ఉండ‌నున్నాయి. ప్రస్తుతం ముంబై - హైదరాబాద్‌ల మధ్య రైలు ప్రయాణానికి కనీసం 15 గంటల సమయం తీసుకుంటోంది. బుల్లెట్ ట్రైన్ వస్తే ఈ ప్రయాణ సమయం 3:30 గంటలకు త‌గ్గుతుంది.  ఈ మార్గంలో బుల్లెట్ రైలు గంటకు 350 కిలోమీటర్లు గ‌రిష్ట వేగంతో ప్ర‌యాణించ‌నుంది. అలాగే ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఒకేసారి 350 మంది ప్రయాణించే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: