విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పట్టాభిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నేతను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. దీంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. లోపల పట్టాభి ఉన్న సంగతిని తెలుసుకున్న పోలీసులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడున్న మీడియాను, కార్యకర్తలను బలవంతంగా బయటకు పంపించేశారు. తలుపులు పగులగొట్టి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అంతకముందు తనను అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు పట్టాభి. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చూపించారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటే వారి చేతిలో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందన్నారు పట్టాభి. తనకు ఎలాంటి ప్రమాదం జరిగినా పోలీసులదే పూర్తి బాధ్యతని హెచ్చరించారు.

పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పట్టాభిని అరెస్ట్ చేయడం పట్ల ఆయన సతీమణి ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతంగా ఆయన్ను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులపై నమ్మకం లేదన్న ఆమె.. తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని హెచ్చరించారు. మరోవైపు పట్టాభిపై 152ఏ, 505(2), 504(ఆర్/డబ్ల్యూ), 120బీ కింద కేసులు నమోదయ్యాయి.


టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేయడంతో.. ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించాల్సి వచ్చింది. పోలీసులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. టీడీపీ శ్రేణులు దాటుకుంటూ ఎట్టకేలకు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 మరింత సమాచారం తెలుసుకోండి: