పోలవరం ప్రాజెక్టు... ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగు నీరు అందించవచ్చు. అలాగే కోటి మంది ప్రజలకు తాగు నీరు అందించవచ్చు. అలాగే విశాఖలోని పరిశ్రమలకు నీరు అందుతుంది. వీటన్నిటికీ తోడు 900 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ఎదురుదాడులు. ఇక ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్నామంటూ ఒడిశా రాష్ట్రం అభ్యంతరాలు. గోదావరి నీటిని అక్రమంగా తరలిస్తున్నారంటూ తెలంగాణ కొర్రీలు. న్యాయం చేయాలంటూ నిర్వాసితుల ఆందోళనలు. అయినా సరే... రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తోంది. అయితే వేగంగా పూర్తి చేస్తామంటూ... నిర్మాణ బాధ్యతను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. వేగంగా పనులు పూర్తి చేసింది. 2019 ఎన్నికల నాటికి పోలవరం పనులు 70 శాతం పూర్తి అయినట్లు కూడా ప్రకటించారు.

అయితే పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేతలు... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపడతామన్నారు. అన్నట్లుగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత... అప్పటి వరకు పనులు చేస్తున్న నవయుగ సంస్థ టెండర్‌ను రద్దు చేసింది జగన్ సర్కార్. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా మేఘా సంస్థకు పనులు అప్పగించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదే అని కూడా మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారాయి. పోలవరం ప్రాజెక్టు మేము చేస్తున్నాం స్వామి, 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. 2022లో ఖరీఫ్‌లో పోలవరం నీళ్లు తీసుకోబోతున్నాం. నిర్వాసితుల కోసం 18 వేల ఇళ్లు కట్టబోతున్నాం. ఐదేళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా దాదాపు 30 వేల మందిని నీటిలో ముంచింది తెలుగుదేశం పార్టీ. పని మాత్రం ఆగటం లేదన్నారు. తాము పర్సంటేజీలు చెప్పటం లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కమిట్ మెంట్‌తో ఉన్నామన్నారు. దీంతో... ఇప్పుడు సోషల్ మీడియాలోనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను టార్గెట్ చేశారు టీడీపీ శ్రేణులు. సార్ డిసెంబర్ వచ్చేసింది. కొత్త బట్టలతో రెడీగా ఉన్నాం. ప్రాజెక్టు ప్రారంభం ఎప్పుడూ అని ఒకరడుగుతుంటే... ఆర్థిక పరిస్థితిని వెక్కిరించేలా... కొబ్బరి కాయలు కొనేందుకు డబ్బులు లేవు... అందుకే ప్రాజెక్టు ప్రారంభం కాలేదని సైటైర్ వేస్తున్నారు. ఆ రోజు అసెంబ్లీలో గొంతు చించుకున్నారు... ఈ రోజు ఎక్కడున్నారు అనిల్ సార్ మరొకరు ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి అనిల్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: