2015 ఏడాది చివరలో కురిసిన వర్షాలకు టమోటా పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఆ ఏడాది ఆల్ టైమ్ హయ్యస్ట్ 200 రూపాయలకు చేరుకుంది కేజీ. టమోటా కేజీ కొన్నారంటే ధనవంతులే అయి ఉంటారనే అనుకున్నారంతా. ఆ తర్వాత యధావిధిగా టమోటా పంట పెరిగింది, రేటు తగ్గింది. కొన్నిసార్లు టమోటా కోసిన కూలీలు గిట్టుబాటు కాక, తోటలోనే వదిలేశారు రైతులు. మళ్లీ ఇప్పుడు టమోటా రేటు ఆకాశాన్నంటుతోంది. హోల్ సేల్ మార్కెట్ లోనే 100 రూపాయలు దాటుతోంది. ఇక సూపర్ మార్కెట్లలో ఏకంగా ఫస్ట్ క్వాలిటీ పేరు చెప్పి కేజీ 150 రూపాయలకు అంటగడుతున్నారు. చూస్తుంటే టమోటా కేజీ 200 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎందుకీ రేటు..?
టమోటా దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా చాలా చోట్ల పంట తీసేశారు. ఈ దశలో అసని తుపాన్ ధాటికి మిగతా చోట్ల పంట దెబ్బతిన్నది. దీంతో ఆటోమేటిక్ గా రేటు భారీగా పెరిగింది. నెలరోజుల క్రితం వరకు 40 రూపాయల లోపే ఉన్న టమోటా కేజీ రేటు ఇప్పుడు 100 రూపాయలు దాటేసింది. మరికొన్ని రోజుల్లో అది డబుల్ సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇళ్లలోనే కాదు, అటు హోటళ్లలో కూడా టమోటాతో చేసే కూరలు తగ్గిపోయాయి. పప్పులో టమోటా వేయట్లేదు, ఇతర కూరల్లో కూడా టమోటా మాయమైపోయింది.

ఇటీవల నిమ్మకాయల  రేట్లు భారీగ పెరగడంతో.. హోటల్లలో నిమ్మకాయ మాయమైపోయింది. గతంలో బిర్యానీతోపాటు ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు ప్లేట్ లో తెచ్చిపెట్టేవారు. ఆ అలవాటు మానుకున్నారు చాలామంది. ఇప్పుడు టమోటాతో చేసే కూరల్ని కూడా కాస్త తగ్గిస్తున్నారు. టమోటా లేకుండా అలవాటు చేస్తున్నారు. టమొటా కర్రీ అంటే ఇళ్లలో కూడా గృహిణులు కాస్త వెనకడుగు వేస్తున్నారు. మార్కెట్లో టమోటా కేజీ కొన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు.

గతంలో కొసరుగా కనీసం ఒకటి రెండు కాయలు వేసేవారు. ఇప్పుడు కొసరడానికి ఏమీ లేదు. కిలో యాపిల్ కంటే కిలో టమోటా రేటెక్కువైపోయింది. ఆ మాటకొస్తే.. మిగతా పండ్లకంటే కూడా టమోటా రేట్లు భారీగా పెరిగాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ఈ రేట్లు ఇక్కడితో ఆగేలా లేవు. మరింత పైకి ఎగబాకే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: