
2024 ఎన్నికలకు ముందు, పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కూటమి ధర్మాన్ని పాటించి, జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో వర్మ కూడా పవన్ విజయానికి కృషి చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పిఠాపురంలో టీడీపీ, జనసేన స్థానిక నేతల మధ్య సఖ్యత కొరవడింది. టీడీపీ నేతలను నియంత్రించినప్పటికీ, వర్మకు ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కకపోవడం ఆయన అనుచరులను కలవరపెడుతోంది. 'జీరో' చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర? .. ఇటీవల మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు ఈ అసంతృప్తిని మరింత పెంచాయి. నారాయణ ఆ మాట అనలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వర్మను 'జీరో' చేశామంటూ టీడీపీలో వినిపించిన వ్యాఖ్యల వెనుక భవిష్యత్తులో ఆయనకు ఏ పదవీ దక్కకుండా చేసే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వర్మ వర్గంలో బలంగా ఉన్నాయి.
పార్టీ నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. వర్మకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇస్తే, పిఠాపురం నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని, అది పవన్ కల్యాణ్, స్థానిక జనసేన నేతలకు మధ్య గ్యాప్‌ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారట. ఈ కారణంగానే, భవిష్యత్తులోనూ వర్మకు ఏ పదవి దక్కే అవకాశం లేకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ ప్రభుత్వ హయాంలో వర్మ మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోక తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. త్యాగం చేసిన నేతకు దక్కిన గుర్తింపు ఇంతేనా అని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.