తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. అటు నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది అయితే, పదవులు దక్కని కొందరు నేతలు అలక వహించారనే వార్తలు షికారు చేస్తున్నాయి. మాజీ మంత్రులు జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అలక బూనారని ఆయన విదేశాలకు వెళ్లారని చర్చ జరుగుతోంది. మిగతా కొంతమంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

అసమ్మతి వార్తల ప్రచారంపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. నిజంగానే నేతలు అలకబూనారా,పదవులు దక్కలేదని అసంతృప్తికి గురయ్యారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారని సమాచారం.కావాలనే కొందరు మీడియా ప్రచారం కోసం చేస్తున్నారా అనే విషయాలపై దృష్టిపెట్టారు. మైనంపల్లి హనుమంతరావు దుబాయ్ కు వెళ్లారని ఆయన అసంతృప్తితో విదేశాలకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది, దీని అసలు నిజం ఏమిటి అనే విషయాలపై ముఖ్య మంత్రి కార్యాలయం తెలుసుకుంది.

ఉద్యమ కాలం నుంచి టీఆర్ ఎస్ పార్టీ అసమ్మతిని ఎదుర్కొంది. అలాంటి సమయంలో కేసీఆర్ చాణక్యం ప్రదర్శించి పార్టీని ఎప్పటికప్పుడు దారిలోకి తెచ్చుకున్నారు. పార్టీ ఎప్పుడూ కేసీఆర్ లైన్ దాటి వెళ్లిన సందర్భం లేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం, టికెట్లు ఇవ్వడంపై అప్పుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కొంత మంది ఆ పేరుతో ప్రచారం చేస్తున్నారు అయితే, కేసీఆర్ తో విభేదించి బయటకు వెళ్లిన చాలా మంది నేతలు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని కొందరు గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు.2014 నుంచి 19 వరకు టీఆర్ ఎస్ ను వీడిన నేతలెవరూ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ.

అయితే గులాబీ దళంలో అసమ్మతి ప్రచారం వెనక బీజేపీ హస్తం ఉందనేది కొందరు టీఆర్ఎస్ నేతల అనుమానం. కావాలనే కొందరు పేర్లను సోషల్ మీడియాలో ప్రచారం పెట్టారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీలో అసమ్మతి లేకుండా మీడియాలో ప్రచారం పెట్టారని అంటున్నారు ,బిజెపి ప్రచారం చేస్తుందా లేక వేరే ఎవరైనా ఈ పని చేస్తున్నారనే విషయాలపై నిఘా వర్గాలతో పాటు టీఆర్ఎస్ లోని కీలక నేతలు సమాచారం సేకరిస్తున్నారు. మొత్తానికి అన్ని అంశాలు పరిశీలించిన తరువాత పార్టీలో పదవులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: