కాన్‌బెర్రా: భారత బౌలర్ తంగరసు నటరాజన్ ఫిక్సింగ్ పాల్పడ్డాడా..? అతడు కావాలనే నో బాల్స్ వేశాడా..? అంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అనుమానం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా పిచ్‌లో జరిగిన నాలుగో టెస్టులో నటరాజన్ మొత్తం 7 నో బాల్స్ వేశాడు. ఈ నో బాల్స్‌ వల్ల ఆసీస్‌కు 6 పరుగులు లభించాయి. ఈ విషయాన్నే వార్న్ లేవనెత్తాడు. ఆ నోబాల్స్‌పై తనకు అనుమానాలున్నాయని, ఆ నోబాల్స్ వేసే సమయంలో నటరాజన్ క్రీజు నుంచి చాలా దూరంగా అడుగు వేశాడని, అదే తనకు అనుమానం కలిగిస్తోందని వార్న్ అన్నాడు.

అంతేకాకుండా అతడు వేసిన ప్రతి ఓవర్ తొలి బంతినే నోబాల్‌గా వేశాడని, మొత్తం నో బాల్స్‌లో 5 నోబాల్స్‌ ఇలానే వేశాడని,. వాటిని గమనిస్తే నటరాజన్ కావాలనే ఈ రకంగా నో బాల్స్ వేశాడేమో అనే అనుమానం కలుగుతోందని వార్న్ పేర్కొన్నాడు. ‘నటరాజన్ బౌలింగ్‌పై నాకు కొన్ని అనుమానాలున్నాయి. నటరాజన్ మొత్తం 7 నోబాల్స్ వేశాడు. ప్రతి నోబాల్ వేసేపట్టపుడు నటరాజన్ క్రీజుకు చాలా దూరంగా అడుగు వేశాడు. మేం అందరం కూడా నో బాల్స్ వేశాం. కానీ నటరాజన్ వేసిన నోబాల్స్‌లో 5 నోబాల్స్ ఓవర్ తొలి బంతే కావడం విచిత్రం’ అని వార్న్ పేర్కొన్నాడు.

టీమిండియా బౌలర్ నటరాజన్‌పై వార్న్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆధారాలు లేకుండా, ఏ మాత్రం బాధ్యత లేకుండా వార్న్ ఆరోపణలు చేస్తున్నాడంటూ భారత క్రికెట్ ఫ్యాన్ అనేకమంది అతడిపై మండిపడ్డారు. ‘హేయ్ ముసలోడా.. టీమిండియా ఆటగాళ్లపై వేలెత్తి చూపడం మానుకో. భారత్‌కు తొలి సారిగా ఎంపికైన ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండు ఆలోచించుకో..’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి.. ‘నీకు, నీ తోటి ఆటగాళ్లు అనేకమందికి ఆటలోనే కాకుండా, బయట కూడా చెత్త పేరుంది. అలాంటి చెత్త బుద్ధితోనే భారతీయ క్రికెటర్ల గురించి ఆలోచించకండి’ అంటూ ఎదురు దాడికి దిగారు. మరి వీటికి వార్న్ ఎలా రిప్లై ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: