నటరాజన్..  ప్రస్తుతం ఈ పేరు భారత క్రికెట్లో మార్మోగిపోతోంది. ఒక సాదా సీదా క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ ఆటగాడు ప్రస్తుతం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ తో భారత జట్టులో స్థానం సంపాదించడమే కాదు.. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత జట్టులో స్థానం సంపాదించుకుని జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించడంతో ప్రస్తుతం నటరాజన్ పేరు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో బౌలర్ గా ఎంట్రీ ఇచ్చాడు నటరాజన్. ఇక మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు తన పదునైన యార్కర్లతో  ఎంతోమంది అభిమానులను ఆకర్షించాడు.



 కేవలం క్రికెట్ ప్రేక్షకులను మాత్రమే కాదు బిసిసిఐ సెలెక్టర్ లను కూడా ఆకర్షించిన ఈ యువ ఆటగాడు ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక అయ్యాడు. ఇక ఎలాంటి అనుభవం లేకపోవడంతో కేవలం బెంచ్ స్ట్రెంత్ కి  మాత్రమే నటరాజన్ పరిమితం అవుతాడు అని అనుకున్నారు. కానీ జట్టులోని ఆటగాడు గాయాల బారిన పడడంతో జట్టులో స్థానం సంపాదించిన యార్కర్ కింగ్.. ఇక అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కీలక వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.  ఇలా టి20, వన్డే సిరీస్ లతోపాటు చివరికి టెస్ట్ సిరీస్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు నటరాజన్.



 అయితే తనకు టీమిండియా జట్టులో అవకాశం దక్కడంపై స్పందించిన నటరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలో తాను అరంగేట్రం చేస్తాను అన్నది తాను కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్. తొలి మ్యాచ్ ఎంతో ఒత్తిడిలో ఆడానని ఇక ఆతర్వాత వన్డే సిరీస్లో అవకాశం వస్తుంది అని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత టెస్టు సిరీస్లో అవకాశం రావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం అన్నది మాటల్లో చెప్పలేని అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే తో పాటు అందరు  ఆటగాళ్లు ఎంతగానో సహకరించారు అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్.

మరింత సమాచారం తెలుసుకోండి: