న్యూఢిల్లీ: తాజాగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న డిజిటల్‌ రుణాల దారుణాలను నివారించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ సమస్యలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఓ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాలన్నీ ఈ గ్రూప్‌ పరిశీలనలో వస్తాయట. అంతే కాకుండా, డిజిటల్‌ రుణాలు తీసుకోవడంలో ఉండే లోటు పాట్లపై కూడా ఈ గ్రూప్ అధ్యయనం చేస్తుందని సమాచారం.

''ఆర్థిక రంగంలో వివిధ డిజిటల్‌ పద్ధతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడం స్వాగతించ తగిన పరిణామం. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిన  అవసరం ఉంది. డేటా భద్రత, ప్రైవసీ, విశ్వసనీయత, వినియోగ దారుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఆర్‌బీఐ తెలిపింది.

ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి ఓ ప్రకటన వెలువడింది. డిజిటల్ రుణాల విషయంలో తగిన విధంగా నియమ, నిబంధనలు తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్‌బీఐ ఈ ప్రకటనలో తెలిపింది.

ఇటీవల కాలంలో డిజిటల్‌ రుణాలను ఇచ్చే వెబ్ సైట్లు లేదా మొబైల్‌ యాప్స్‌ వాడకం వల్ల వచ్చే అనేక సమస్యలు బయట పడ్డాయి. ఈ సమస్యల విషయంలో ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వర్కింగ్‌ గ్రూప్‌ డిజిటల్‌ రుణాల లోటుపాట్లను అధ్యయనం చేస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ 10 పైగా డిజిటల్‌ యాప్‌లు రుణాలను మంజూరు చేస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీటి ద్వారా రుణాలు పొంది, వడ్డీలు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు సమాచారట. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం మంచి విషయమని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: