మహా అయితే ఆవు పాలను ఎవరైనా దొంగతనం చేస్తారు, అసలు ఆవు పేడను ఎందుకు దొంగతనం చేస్తారని మీరు అనుకుంటున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం. ఆవు పాలకంటే, ఇప్పుడు ఆవు పేడకి బాగా డిమాండ్ పెరిగింది. గోమాత మూత్రం, గోమాత పేడ.. అత్యంత కాస్ట్ లీ గా మారిపోయాయి. అయితే దీనికోసం దొంగతనాలు జరగడమే ఇక్కడ విచిత్రం. ఇంకా వింతైన విషయం ఏంటంటే.. ఈ దొంగతనాలను ఆపేందుకు సీసీ టీవీ కెమెరాలను పెట్టాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది.  గౌ-దాన్ కేంద్రాల్లో సీసీ టీవీల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.

అసలేంటీ గౌ-దాన్ కేంద్రాలు..
చత్తీస్ ఘడ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్‌ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. కిలో ఆవు పేడను రూ.2కి కొనుగోలు చేస్తామని పేర్కొంది. అప్పటి నుంచి ఆవు పేడకు ఆ రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీని ఫలితంగా దొంగతనాలూ పెరిగాయి. తాజాగా అంబికాపూర్‌ మున్సిపాల్టీలో స్థానిక ప్రభుత్వం నిర్వహిస్తున్న గౌ-దాన్‌ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడటంతో సంచలనంగా మారింది. అయితే దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే వారిని పట్టుకున్నారు పోలీసులు. మొత్తం ఐదుగురు మహిళలు ఇలా ఆవుపేడను దొంగిలించి పారిపోతూ పోలీసులకు చిక్కారు. వారినుంచి 45 కేజీల పేడను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆవుపేడకోసం చత్తీస్ ఘడ్ లో గొడవలు మామూలే, ఇప్పుడిలా దొంగతనాలు కూడా పెరిగిపోవడంతో అధికారులు కలవరపడుతున్నారు. గోవుల్ని సంరక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆవుపేడకు రేటు కట్టి కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా గో సంరక్షణ జరుగుతుంది అనుకుంటే.. ఇలా పేడకు డిమాండ్ పెరిగిపోయి, దొంగతనాల వరకు వెెళ్లడమేంటని ప్రభుత్వం కలవరపడుతోంది. అసలీ దొంగతనాలు ఆపేందుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసింది. గౌ-దాన్‌ కేంద్రాల దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని కూడా నియమించి గౌ-దాన్ కేంద్రాల వద్ద నిఘా పటిష్టం చేస్తామంటున్నారు. వినడానికి సిల్లీగా ఉన్నా చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ ప్రస్తుతం ఇదే జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: