
ఇదంతా ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ అనే మరో సంస్థతో కలసి నిర్వహించిన అక్రమ కార్యకలాపాల భాగంగా సాగిందని తెలుస్తోంది. అసలైన బాంబ్ అయితే ఒక డీఎన్ఏ టెస్ట్ రూపంలో పేలింది. రాజస్థాన్‌కు చెందిన దంపతులు గతంలో డాక్టర్ నమ్రతను సంప్రదించి, సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులయ్యారు. అయితే ముందుగానే డీఎన్ఏ టెస్ట్ చేయాలన్న షరతు పెట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్ఏ నమూనాలను పరిశీలిస్తే, బిడ్డ తల్లిదండ్రులు వీరే కాదన్న విషయం బయటపడింది. దీంతో మోసపోయామని గ్రహించిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వెలుగు చూస్తుండగానే, పంకజ్ సోనీ అనే ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్‌తోపాటు మరో 6 మంది సిబ్బంది అరెస్టయ్యారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అక్రమంగా వీర్యకణాలు, అండాలు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. మరింతగా పరిశీలిస్తే విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న బ్రాంచుల్లో కూడా ఇదే రకంగా అక్రమ కార్యకలాపాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. సరోగసీ పద్ధతిని ఉపయోగించుకోవాలనుకున్న అభాగ్య దంపతుల ఆశల్ని దోచుకుని... మానవ సంబంధాలను వ్యాపారంగా మార్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సమాజాన్ని షేక్ చేస్తోంది. ఈ కేసు పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. డీఎన్ఏ టెస్ట్ వల్ల నిజాలు బయటపడకపోయుంటే, ఇలాంటివి ఎన్ని జరిగి ఉండేవో ఊహించడమే భయంకరం!