ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ వినియోగదారులకు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తమ సంస్థలో వినియోగదారులకు అందించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలను పెంచాలని భావిస్తోంది. దీంతో వినియోగదారులకు అదనపు భారం పడనుంది. పాలసీ ప్రీమియం ధరలు పెంపుపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైనది. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సేవా సంస్థ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మహేశ్ బాలసుబ్రమణియన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు నూతన పాలసీకి అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు.. త్వరలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) డాక్యూమెంట్లు సమర్పించనున్నట్లు పేర్కొంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి చెందుతోంది. ఒక వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీమా సంస్థలపై, బీమాపై బీమాను (రీ-ఇన్సూరెన్స్) ఆఫర్ చేసే సంస్థలపై తీవ్రంగా ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. దీంతో తమ సంస్థకు సంబంధించిన ప్రీమియం ధరలు, అండర్ రైటింగ్ నిబంధనలను మార్చుకోవడం అవసరం ఏర్పడినట్లు ఎండీ పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా భారీ ఎత్తున క్లెయిమ్ వచ్చాయి. దీంతో ఇప్పటికే చాలా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియం ధరలు పెంచినట్లుగా ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా కోటక్ ఎండీ మహేశ్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ.. ‘‘వినియోగదారులకు గమనిక. గతేడాది ఏప్రిల్‌లో చివరిగా ప్రీమియం ధరలు పెంచాము. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రీమియం ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాము. పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత నూతన ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసుకుంటాం.’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రీమియం ధరల పెంపు అనేది.. వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించేలా ఉంటుందని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి మొదటి ఆరు నెలల్లో 62,828 క్లెయిమ్‌లకు సంబంధించి.. దాదాపు రూ.1,230 కోట్లను సంస్థ చెల్లించిందన్నారు. ప్రీమియం ధరల పెంపు విషయంలో వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. త్వరలో ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: