ఉద్యోగ సంఘాలు జగన్ సర్కారుపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. సీపీఎస్ స్కీమ్ రద్దు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఎన్నికల హామీని అమలు చేయాల్సిందేనని పట్టుపడుతున్నాయి. సెప్టెంబర్‌ ఒకటిని సీఎం ఇంటిని ముట్టడించాలని.. చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపు ఇచ్చాయి. అయితే.. గత అనుభవాల దృష్ట్యా ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో సఫలం కానీయకూడదని పోలీసులు గట్టి పట్టుదలగా ఉన్నారు.


సెప్టెంబరు 1వ తేదీ దగ్గర పడుతుండడంతో విజయవాడ పోలీసులు తమ చర్యలు వేగవంతం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో ఆందోళనలు జరగకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా నిర్బంధాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే హోటళ్లు, డార్మిటరీలు, ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలతో పోలీసులు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలకు సహకరించవద్దని వారికి పోలీసులు స్పష్టం చేశారు. చివరకు ట్రావెల్స్, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులను కూడా ఆయా స్టేషన్లకు పిలిచి పోలీసులు మాట్లాడారు. ఒకటో తేదీన నగరంలోని అన్ని టిఫిన్‌ సెంటర్లు ఉదయం పూట మూసి ఉంచాలని పోలీసులు ఆదేశించారు.


జిల్లాల నుంచి ఉద్యోగులు రాకుండా అన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీలను కూడా పిలిపించి పోలీసులు మాట్లాడారు. సామాన్యులు కాకుండా ఇతరులు ఎక్కువగా ప్రయాణిస్తుంటే ఆరా తీయాలని పోలీసులు సూచించారు. జిల్లాలకు వెళ్లే ట్యాక్సీ యజమానులకు కూడా పోలీసులు ఇదే రకమైన ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఉద్యోగులకు సహకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గతంలో ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న వారి వివరాలను స్టేషన్ల వారీగా పోలీసులు ఇప్పటికే సేకరించారు.


ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. కీలకమైన వారిని బైండోవర్లు చేస్తున్నారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి విజయవాడలో సభకు అనుమతి లేదని, ఆందోళనలను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: