కర్మ ఫలం అనుభవించక తప్పదని హిందూ ధర్మం చెబుతుంది. ఇప్పుడు మనిషి ప్రకృతి విషయంలోనూ ఇదే జరుగుతోంది. మనిషి అత్యాశ, అనాలోచన కారణంగా ప్రకృతి విధ్వంసం అవుతోంది. ఆ విధ్వంసం వినాశనానికి దారి తీస్తోంది. అందులో భాగంగానే వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మనిషి ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు ఈ వాతావరణ మార్పులే అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ వాతావరణ మార్పుల కారణంగా భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఉన్న హిమనీనదాలు కరుగుతున్నాయని కొన్నాళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం.


అయితే... తాజాగా తేలిందేమిటంటే.. ఈ ముప్పు ఉత్తర, దక్షిణ ధ్రువాలకే కాకుండా హిమాలయాలకు కూడా పొంచిఉందట. ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలకు హిమాలయాలు కూడా రికార్డు స్థాయిలో కరుగుతున్నాయట. ప్రస్తుతం పాకిస్తాన్‌కు వరదలు వచ్చి  మూడో వంతు దేశం వరద నీటిలో మునగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవానికి హిమాలయాలు కరగడం కూడా ఓ కారణమేనట. పాకిస్థాన్‌లో అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా ఓ కారణమేనట.


హిమాలయాల్లోని మంచు ఫలకాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరిగిపోయాయని ఇండోర్‌ ఐఐటీ బృందం తెలిపింది. ఈ ఐఐటీ బృందం 15 ఏళ్ల నుంచి హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు చేస్తోంది. ఈ వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల హిమ ఫలకాలు కరిగాయని  ఇండోర్‌ ఐఐటీ బృందం చెబుతోంది. హిమాలయాల్లో హిమానీనదాలు 40 శాతం వరకు వైశాల్యాన్ని కోల్పోయినట్లు ఇండోర్‌ ఐఐటీ పరిశోధన బృందం కనుగొంది.


మొత్తం 28 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హిమానీనదాలు గత ఏడాది 19 వేల 600 చదరపు కిలోమీటర్లకు పరిమితం అయ్యాయని ఇండోర్‌ ఐఐటీ బృందం తెలిపింది. అంటే 390 క్యూబిక్‌ కిలోమీటర్ల మంచు కరిగిపోయిందన్నమాట. హిమాలయాలు ఇలా వేగంగా కరిగిపోతే భవిష్యత్తులో భారత ఉపఖండంలో నీటి కరవు సంభవించే ప్రమాదం కూడా ఉందని పరిశోధన బృందం  హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: