జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకమైన అసెంబ్లీ సీటు. ఈ ప్రాంతం ధ‌నిక ఓట‌ర్ల‌తో పాటు మైనార్టీ ఓటర్ల  అడ్డా. త్వ‌ర‌లో జ‌రిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారవుతుందన్న సంకేతాలు రావడంతోనే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు నుంచి నవీన్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్ వెళ్లింది. “ నియోజకవర్గంలో బలంగా పనిచేయండి ” అనే సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సీటు కోసం పలువురు టిక్కెట్ కోసం లాబీయింగ్ చేసినప్పటికీ, రేవంత్ రెడ్డి తన ప్రణాళిక ప్రకారం వారందరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్‌కు అవకాశం కల్పించారు.


అయితే ప్రకటనకు ముందు ఓటర్ కార్డుల పంపిణీ వివాదంలో నవీన్ యాదవ్ పేరు రావడం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా పార్టీ చివరికి రిస్క్ తీసుకుని నవీన్ పేరునే ఖరారు చేసింది. న‌వీన్ యాద‌వ్ పేరు ఇక్క‌డ ఫైన‌ల్ కావ‌డానికి ముఖ్య కారణం మజ్లిస్ పార్టీ మద్దతు. గతంలో నవీన్ యాదవ్ మజ్లిస్ నేతగా పనిచేశారు. ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా కూడా బలమైన పట్టు ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న ఆయనకు, మజ్లిస్ పరోక్ష మద్దతు లభించడంతో కాంగ్రెస్ ఈ సీటును వదులుకోలేదు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 90 వేలకుపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందో, వారే విజేతను నిర్ణయిస్తారు. ఆ వర్గాల్లో నవీన్ కుటుంబానికి బలమైన అనుబంధం ఉంది. అంతేకాదు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీకు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై ఎప్పటినుంచో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశం కూడా నవీన్‌కు ప్లస్‌గా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని సమీకరణాలు నవీన్ యాద‌వ్‌కు క‌లిసి వ‌స్తాయి అనే లెక్కన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.


ఇప్పుడీ పరిణామాలతో జూబ్లీహిల్స్ పోరు మరింత హీట్‌గా మారింది. కాంగ్రెస్ నిర్ణయంతో బీఆర్‌ఎస్ కఠిన సవాలును ఎదుర్కొనాల్సి వస్తుంది. అన్ని కూటమి లెక్కల్లో నవీన్ యాదవ్ పేరు ప్రస్తుతం జూబ్లీహిల్స్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: