గత సంవత్సర కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకి తయారుచేస్తున్న టీకా కోసం ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు టీకాలు మహమ్మారిపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల నివేదికలు తెలియజేశాయి. ఇందులో ఆక్స్‌ ఫర్డ్ - ఆస్ట్రాజెన్‌కా టీకా 70 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. అయితే ఈ ఆక్స్ ఫర్డ్ టీకా తయారీ ప్రక్రియలో తప్పు జరిగిపోయిందని, అందువల్లే క్లినికల్ ట్రయల్స్‌ లో ప్రాథమిక ఫలితాలు పలు రకాల ప్రశ్నలను ఉత్పన్నమయ్యేలా చేశాయని ఆ సంస్థ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.


 

తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డోస్‌లను తీసుకున్న వారిలో కరోనా వైరస్‌ను నిలువరించే వ్యాధినిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్‌ ఫర్డ్ ప్రకటించిన కొద్ది రోజుల తరువాత.. కొంతమంది వాలంటీర్లు రెండు డోస్‌లు తీసుకున్నా, అవసరమైన వ్యాధి నిరోధకతను పొందలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆక్స్‌ ఫర్డ్.. వారు తీసుకున్న టీకా తయారీలో తప్పు జరిగిందని వెల్లడించింది.

ఈ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో కోవిడ్-19 ని నిరోధించే శక్తి అధికమైందని, రెండు డోస్‌లను తీసుకున్న వారితో పోలిస్తే, ఒక డోస్ ఇచ్చినవారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా కనిపించిందని వర్శిటీ తన ఫలితాల నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒక్కో డోస్ తీసుకున్న వారిలో 90 శాతం ప్రభావవంతం, రెండు డోస్‌లు పొందిన వారిలో 62 శాతం ప్రభావవంతం చూపినట్టు ఆస్ట్రాజెనికా వెల్లడించింది. మొత్తం మీద తమ టీకా 70 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. కానీ ఫలితాల నివేదిక అస్పష్టంగా ఉండటంతో నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం బ్రిటన్‌తో పాటు బ్రెజిల్‌లోనూ ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే సోమవారం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పాక్షికంగా ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌ లో పాల్గొన్న వాలంటీర్లకు బహుళ టీకాల మోతాదులను ప్రయత్నిస్తున్నారు. మెనింజైటిస్ వ్యాక్సిన్ లేదా సెలైన్ షాట్ ఇచ్చిన ఇతరులతో ఫలితాలను పోల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: