డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. 2000లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన బద్రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన పూరి ఈ 20 ఏళ్ల కెరీర్‌లో టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, బాల‌య్య‌, నాగార్జున లాంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాలు చేశారు. అలాగే బాలీవుడ్‌లో అమితాబ‌చ్చ‌న్‌ను సైతం డైరెక్ట్ చేసిన ఘ‌న‌త పూరీకే ద‌క్కింది.

 

టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస ప్లాపులు ఎదుర్కొన్న పూరి ఎట్ట‌కేల‌కు రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యే ముందు జ‌రిగిన సంఘ‌ట‌న విచిత్ర‌మే. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు విజయాలతో యువతరం ఆరాధ్యనాయకుడిగా మారిపోయారు పవన్‌కళ్యాణ్‌. అతడితో సినిమా చేయాలని పూరి జగన్నాథ్‌ సంకల్పించారు. ప‌వ‌న్‌ను క‌లిసేందుకు కెమేరామెన్ చోటా కె.నాయుడు సాయం కోరాడ‌ట ప‌వ‌న్‌.

 

అయితే ముందు క‌థ నాకు న‌చ్చితేనే ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తాన‌ని చోటా మెలిక పెట్టార‌ట‌. అయితే పూరి చోటాకు బ‌ద్రి క‌థ చెపితే తిర‌స్క‌రిస్తాడ‌ని అతడికి ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం కథ చెప్పి ఒప్పించారు. అలా ఛోటా కె.నాయుడు ద్వారా పవన్‌కల్యాణ్‌ను కలిసిన పూరి జగన్నాథ్‌ సింగిల్‌ టేకింగ్‌లోనే పవన్‌కు  బద్రి కథను చెప్పి ఒప్పించారు. క‌థ విన్న ప‌వ‌న్ క్లైమాక్స్ మార్చ‌మ‌ని చెప్పినా పూరి మాత్రం ఒప్పుకోలేద‌ట‌.

 

అయితే కథపై పూరి జగన్నాథ్‌కు ఉన్న నమ్మకం చూసి పవన్‌ సినిమా చేయడానికి అంగీకరించారు. విజ‌య‌ల‌క్ష్మి ఆర్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత అయిన దివంగ‌త టి.త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్ప‌ట్లో 45 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: