దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరుచుకోవచ్చంటూ కేంద్రం అనుమతులిచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ ఓనర్లు సహా చిన్న చిన్న థియేటర్ల వాళ్లు కూడా రిస్క్ చేయలేదు. రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఎప్పుడు థియేటర్లు తెరుస్తారనే విషయం సందేహంగానే మారింది. ఈ దశలో అసలు సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకోవచ్చు అనే విషయంపై టాలీవుడ్ లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.
లాక్ డౌన్ టైమ్ లో దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ మల్టీప్లెక్స్ లు మూతపడ్డాయి. దీంతో థియేటర్స్ లో సినిమాల విడుదల ఆగిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపులతో సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మాములు స్థితికి వస్తోంది. సినిమా షూటింగుల సందడి తిరిగి ప్రారంభమైంది. అంతేకాక కేంద్ర ప్రభుత్వం సగం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. మిగతా రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లు తెరచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా హాళ్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై స్పష్టత లేదు.

మరోవైపు ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఒకటి రెండు సినిమాలు మినహా మిగతావారంతా.. అనివార్యంగా ఓటీటీవైపు వెళ్తున్నారు. థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా కూడా ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంక్రాంతి విడుదల అంటూ చాలా సినిమాలకు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ విడుదల అని ఏ సినిమా కూడా ముందుగా వచ్చే ప్రయత్నం చేయడంలేదు.

అంటే ఒకరకంగా ఈ ఏడాది థియేటర్స్ లోకి వచ్చేందుకు ఏ సినిమా హీరో కూడా ధైర్యం చేయడంలేదు, ఏ నిర్మాత కూడా సాహసం చేయడంలేదు. సంక్రాంతి టైమ్ కి థియేటర్స్ జనంతో కళకళ లాడే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందుకే సినిమాల ప్రమోషన్ అంతా సంక్రాంతి విడుదల అంటూ పెద్ద పండగ చుట్టూనే తిరిగుతోంది. సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరిచే ప్రసక్తే లేదని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: