తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విజ‌య‌వంత‌మైన నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు సినిమా నిర్మాణంలో ఉన్న‌ప్పుడే ఆ సినిమా విజ‌య‌వంత‌మ‌వుతుందా?  లేదా? ఎంత మార్కెట్ చేస్తుంది? ఎంత లాభం వ‌స్తుంది?  లాంటి అంచ‌నాల‌న్నీ దిల్ రాజు చేసేయ‌గ‌ల‌రు. ఈ కోవ‌లోనే ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌వంత‌మైన అల్ల‌రి న‌రేష్ సినిమా నాందిపై రాజు మ‌న‌సు పారేసుకున్నారు. వెంట‌నే వాటి రీమేక్ రైట్స్‌ను  కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సినిమాను నాలుగు భాషల్లో  నిర్మించనున్నారని అంటున్నారు. ఇక ‘ఆహా’లో ‘నాంది’ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది.

చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసిన నాందిలో అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర‌లు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ‘నాంది’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇటీవలే  దిల్ రాజు ‘నాంది’ టీమ్‌ను మీడియా సమక్షంలో అభినందించారు. అయితే, తాజాగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ‘నాంది’ రీమేక్ రైట్స్ దిల్ రాజు కొనుగోలు చేశార‌ని, ఆ సినిమాను ఆయ‌న నాలుగు భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

‘నాంది’ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేసేందుకు హక్కుల నిమిత్తం రూ. 2.75 కోట్లు దిల్ రాజు చెల్లించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో దిల్ రాజు చేతులు కలిపారంటున్నారు. మరోవైపు, ‘నాంది’ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు రూ. 5.28 కోట్ల షేర్ వసూలు చేసిందని సమాచారం. మరికొద్ది రోజుల్లో ‘నాంది’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ‘ఆహా’ రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసిందట. సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ సంగీతం సమకూర్చ‌గా అబ్బూరి ర‌వి డైలాగులు రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: