ఆర్ఆర్ఆర్... రౌద్రం... రణం.. రుధిరం.. అంటూ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో... యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. అటు టాలీవుడ్ మొదలు... బాలీవుడ్ ప్రముఖుల వరకు ఈ సినిమా విడుదల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ పవర్ ప్యాక్ సినిమా... మరో నెల రోజుల్లో... సరిగ్గా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే భీమ్‌గా ఎన్టీఆర్, రాజ్‌గా రామ్ చరణ్ గెటప్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేసింది. ఇక విడుదలైన మూడు పాటలు అయితే యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతున్నాయి. నాటు నాటు సాంగ్ అయితే... రికార్డులు రేపుతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆర్ఆర్ఆర్ యూనిట్ విడుదల చేసింది. అనూహ్యంగా ముందుగా థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే.. యూ ట్యూబ్‌లో లాంచ్ చేసింది జక్కన్న టీమ్.

ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్్ ఎదురుచూస్తున్న గడువు వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అనుకున్న దాని కంటే ఒక రేంజ్‌లో ఉంది. 3 నిమిషాల 16 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నడుస్తోంది. ట్రైలర్‌లో ఎన్టీఆర్, చెర్రీ యాక్షన్ సీన్లకు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు కూడా. అయితే భారీ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ... ట్రైలర్ మాత్రం వకీల్ సాబ్ కంటే వెనుకబడింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో విడుదలైన కేవలం 7 నిమిషాల్లోనే 100K లైకులు సొంతం చేసుకుంది. ఇది ఇప్పటి వరకు రికార్డుగానే ఉంది. ఈ రికార్డును ఆర్ఆర్ఆర్ చెరిపేస్తుందని అంతా భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు యూ ట్యూబ్‌లో 100K లైకులు రావడానికి 8 నిమిషాలు పట్టింది. దీంతో పవన్ రికార్డు అలాగే పదిలంగా మిగిలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: