పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. ఆ టెన్షన్లోనే జాతీయ నాయకులను తనకు మద్దతుగా పిలిపించుకుంటున్నారు. అలా వచ్చిన జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తే తనకు రూ 1500 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఫరూక్ ఇపుడు చెబుతున్నారు. ఫరూక్ చెప్పిన విషయంపైనే అందరిలోను అనేక అనుమానాలు మొదలయ్యాయి.

 

మొదటి అనుమానం ఏమిటంటే జగన్ పై ఫరూక్ చేసిన ఆరోపణకు ఆధారముందా ? అని. ఎందుకంటే ఫరూక్ చెబుతున్నదానిలో  ఏమాత్రం పసలేదని తేలిపోతోంది. జగన్ సిఎం కావాలని అనుకున్న మాట వాస్తవమే. అందుకనే జగన్ తరపున ఎంఎల్ఏల సంతకాలను సేకరించారు. అయితే, సోనియా గాంధి అందుకు అంగీకరించలేదు. ప్రత్యామ్నాయంగా కేంద్రంలో సహాయ మంత్రిపదవి జగన్ కు ఆఫర్ చేశారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆ ఆఫర్ కు జగన్ సమ్మతించలేదు.

 

దాని ఫలితంగానే జగన్ కాంగ్రెస్ పార్టీనుండి బయటకు వచ్చేశారు. సరే తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే. ఈ మొత్తంమీద అసలు ఫరూక్ జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడుంది ? ఫరూక్ ఏమీ కాంగ్రెస్ నేతకాదే ? పోనీ ఫరూక్ చెబితే సోనియా గాంధి వింటుందా ? అంటే అదీ గ్యారెంటీ లేదు. మరలాంటపుడు ఫరూక్ ను జగన్ ఎందుకు కలుస్తారు ? ఎందుకు డబ్బులు ఆఫర్ చేస్తారు ?

 

అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో వీరప్పమొయిలీ, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, వాయిలార్ రవి, జై రాం రమేష్, చిదంబరం లాంటి వాళ్ళ హవా బ్రహ్మాండంగా సాగుతోంది. వాళ్ళకే ఏపితో ప్రత్యేకమైన అనుబంధముంది. పైగా పై నేతలందరితోను దివంగత నేత వైఎస్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ కలిస్తే గిలిస్తే వారిలో ఎవరినైనా కలుస్తారే కానీ ఫరూక్ ను కలిసే అవకాశాలు తక్కువ. బయట వాళ్ళతో చెప్పించాలనుకుంటే శరద్ పవారే ఉన్నారు.  

 

అంతేకానీ ఏపి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, వైఎస్ కు పెద్దగా పరిచయం లేని ఫరూక్ ను కలిసి జగన్ రూ 1500 కోట్లు ఇస్తానని చెప్పారంటే ఎవరూ నమ్మటం లేదు. ఎందుకంటే వైఎస్ పరిచయాలే జగన్ పరిచయాలు కాబట్టి. ఎవరూ నమ్మరని తెలిసినా ఫరూక్ ఎందుకు చెప్పారు ? సింపుల్, చంద్రబాబునాయుడు కోసమే అయ్యుంటుంది. జగన్ కు వ్యతిరేకంగా ఫరూక్ ను చంద్రబాబు పిలిపించుకున్నారు కాబట్టి రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జగన్ పై  ఫరూక్ ఏదో బండలేద్దామని అనుకునుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: