దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నా మెజారిటీ ప్రజల ఆసక్తి మాత్రం ఆంధ్రావైపే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి పెద్ద సాహసమే చేశాయి. కొత్త ముఖాలను వెతికి మరీ పోటీలో నిలిపాయి. మరి ఈ కొత్త ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది?

ఏపీకి సంబంధించి 2019 పార్లమెంటరీ ఎన్నికల ముఖచిత్రం చాలా భిన్నంగా ఉంది. రాజకీయ పార్టీలు  ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పెట్టినంత ఫోకస్ ఎంపీ అభ్యర్థులపై పెట్టలేదు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎంపీ లను... ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు.  వైసీపీ ఏకంగా 19 స్థానాల్లో కొత్త వారిని బరిలోకి దించింది. టిడిపి కేవలం 10 మంది సిట్టింగులకే మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది. మొత్తంగా చూస్తే.. 2014లో టీడీపీ, వైసీపీల తరఫున తలపడిన అభ్యర్థల జోడీ లో ఏ  ఇద్దరూ 2019 ఎన్నికల బరిలో మళ్లీ పోటీ పడటం లేదు. 2019 ఏపీ ఎన్నికలకు సబంధించి.. పార్లమెంట్ అభ్యర్థుల కోసం టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు చివరిదాకా వెతుకులాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఒంగోలు ఎంపీ బరిలో టీడీపీ ఏకంగా మంత్రి సిద్ధారాఘవరావును బరిలోకి దింపింది. ఆయనను ఒప్పించడానికి సీఎం తీవ్రమైన కసరత్తు చేశారు. ఆయనకు మొదట దర్శి సీటును కేటాయించేశారు. అయితే ఎంపీ బరిలో సరైన నేత లేకపోవడంతో.. చివరి క్షణాల్లో ఆయనను రంగలోకి దింపారు.  అలాగే నెల్లూ విషయంలో  అభ్యర్థుల కోసం వెతుకులాడిన టిడిపి చివరకు.. బీదా మస్తాన్ రావుకి ఆ సీటు కేటాయించింది. తిరుపతి నుంచి కూడా ఎంపీగా పోటీ చేయడానికి టీడీపికి సరైన అభ్యర్థి దొరకలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పనబాక లక్ష్మిని తమ పార్టీలో చేర్చుకుని ఎంపీ సీటు కేటాయించారు. అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారడు పవన్ ను రంగంలోకి దించారు. నరసారావుపేట సీటు విషయంలోనూ చాల తర్జనభర్జలు జరిగాయి. రాయపాటిని మార్చాలని టీడీపీ అధినాయకత్వం ప్రయత్నించింది. కొందరి పేర్లు కూడా పరిశీలించారు. చివరి క్షణాల్లో తిరిగి ఆయనకే సీటు కేటాయించారు. బాపట్ల సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని మార్చాలని భావించినా.. చివరి నిమిషంలో ఆయనకే సీటు ఖరారు చేశారు. కాకినాడ నుంచి సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం పోటీ చేయనని ప్రకటించారు. ఆయన పార్టీ కూడా మారిపోయారు. దీంతో గతంలో వైసీపీ తరఫున బరిలోకి దిగిన చెలమలశెట్టి సునీల్ ను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు.

రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళిమోహన్ పోటీకి నిరాకరించారు. మొదట ఆయన కోడలు రూప పేరు తెరమీదకు వచ్చింది. ఆమె కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అనేక పేర్లు పరిశీలించారు. చివరకు రూపనే రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అమలాపురం సిట్టింగ్  ఎంపీ  పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరారు. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. మాజీ ఎంపీ, ఒకప్పటి కాంగ్రెస్ నేత హర్షకుమార్  పేరును పరిశీలించారు. ఆయనకు దాదాపు సీటు ఖరారైందంటూ ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణాల్లో బలయోగి తనయుడు హరీష్ ను రంగంలో దింపింది. విశాఖపట్నం నుంచి అనేక పేర్లు వినిపించినా..  చివరి క్షణాల్లో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కి టికెట్ కన్ఫామ్ చేశారు.

వైసీసీలో దాదాపు 19  కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. వీరిలో 14 మంది ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఎంపీ అభ్యర్థుల విషయంలో వైసీపీ యువతకు పెద్ద పీట వేసింది.  చివరి నిమిషంలో టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి..  కి ఏకంగా నెల్లూరు ఎంపీ సీటు కట్టబెట్టింది. గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అమలాపురం ఇలా అనేక చోట్ల వైసీపీ కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. కాకినాడలో మాత్రం.. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీతకు అవకాశం ఇచ్చారు.  సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతలు అనేక మంది వైసీపీలో ఎంపీ సీట్లు దక్కించుకున్నారు. పెద్ద సంఖ్యలో కొత్త అభ్యర్థలు బరిలో ఉంటంతో.. ఫలితాలు అంచనాలకు అందడం లేదు. ఏ నియోజవర్గంలో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: